ఫెడరేషన్ కప్‌లో నీరజ్‌కు స్వర్ణం

భువనేశ్వర్‌లో జరిగిన ఫెడరేషన్‌ కప్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్, టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా స్వర్ణం సాధించాడు.

Update: 2024-05-15 17:09 GMT

దిశ, స్పోర్ట్స్ : భువనేశ్వర్‌లో జరిగిన ఫెడరేషన్‌ కప్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్, టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా స్వర్ణం సాధించాడు. నీరజ్ మూడేళ్ల తర్వాత దేశవాళీ టోర్నీలో పాల్గొని సత్తాచాటాడు. నాలుగో ప్రయత్నంలో అతను 82.27 మీటర్లు బల్లెం విసిరి విజేతగా నిలిచాడు. తొలి ప్రయత్నంలో 82 మీటర్ల ప్రదర్శన చేసిన అతను.. రెండో రౌండ్‌లో ఫౌల్, మూడో రౌండ్‌లో 81.29 మీటర్లు బల్లెం విసిరాడు. నాలుగో రౌండ్‌లో నీరజ్ ప్రదర్శనను మిగతా అథ్లెట్లు అధిగమించలేకపోయారు. దాంతో అతను మిగిలి రెండు త్రోలను ప్రయత్నించలేదు.

డీపీ మను 82.06 మీటర్ల ప్రదర్శనతో రజతం గెలుచుకోగా.. ఉత్తమ్ బాలాసాహెబ్ పాటిల్(78.39 మీటర్లు) కాంస్యం సాధించాడు. అలాగే, నీరజ్‌తోపాటు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన కిశోర్ జెనా ఈ ఈవెంట్‌లో నిరాశపరిచాడు. 75.49 మీటర్ల త్రోతో ఐదో స్థానంతో సరిపెట్టాడు. కాగా, 2021లో ఇదే టోర్నీలో పాల్గొన్న నీరజ్ మూడేళ్ల తర్వాత దేశవాళీ ఈవెంట్‌లో బరిలోకి దిగాడు. 2021లో కూడా స్వర్ణం గెలిచాడు. అప్పుడు 87.80 మీటర్లు త్రో చేశాడు. గత వారం దోహా డైమండ్ లీగ్‌లో 88.36 మీటర్ల ప్రదర్శనతో నీరజ్ రజతం సాధించిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News