అతడు ఆడకపోతే టెన్నిస్‌కు పెద్ద దెబ్బ : రోజర్ ఫెడరర్

ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ సమయానికి రాఫెల్ నాదల్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని రోజర్ ఫెడరర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Update: 2023-05-08 15:08 GMT

న్యూఢిల్లీ: ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ సమయానికి రాఫెల్ నాదల్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని రోజర్ ఫెడరర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఒకవేళ అతను ఈ ఏడాది ఆడలేకపోతే టెన్నిస్‌కు పెద్ద దెబ్బే అని అన్నాడు. నాదల్ 14సార్లు ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్‌గా నిలిచాడు. జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో నాదల్ హిప్ ఇంజురీకి గురయ్యాడు. ఈ వారంలో జరిగిన ఇటాలియన్ ఓపెన్‌లో నాదల్ పాల్గొనలేదు. దీంతో ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరమవుతాడేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. నాదల్ గత వారంలో మాడ్రిడ్ ఓపెన్‌తో పాటు ఇండియన్ వెల్స్, మియామీ, మాంటే కార్లో, బార్సిలోనా వంటి టోర్నీలకు దూరమయ్యాడు. ‘రాఫా గనుక ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరమైతే టెన్నిస్‌కే పెద్ద దెబ్బ.

అతడిని రోమ్‌లో చూస్తానని అనుకుంటున్నాను. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మరోవైపు నోవక్ జకోవిచ్ కూడా ఆడటం లేదు. దీంతో అంతా యువకులే బరిలోకి దిగనున్నారు’ అని గతేడాది రిటైర్మెంట్ ప్రకటించిన ఫెడరర్ అన్నాడు. 2005లో తొలి టైటిల్ గెలిచినప్పటి నుంచి నాదల్ ప్రతి ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో ఆడుతున్నాడు. నాదల్ ఓవరాల్‌గా 22 మేజర్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ నెల 28న ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ ప్రారంభం కానుంది.

Tags:    

Similar News