Praggnanandhaa: 'మా అమ్మే నా బలం'

Update: 2023-09-04 16:51 GMT

కోల్‌కతా : మా అమ్మే తనకు బలమని, ఆమె ఎంత ముఖ్యమో తాను మాటల్లో చెప్పలేనని భారత చెస్ యువ సంచలనం ప్రజ్ఞానంద తెలిపాడు. ఇటీవల జరిగిన చెస్ ప్రపంచకప్‌లో ప్రజ్ఞానంద‌తోపాటు అతని తల్లి నాగలక్ష్మి టోర్నీకి హాజరైన విషయం తెలిసిందే. సోమవారం కోల్‌కతాలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రజ్ఞానంద మాట్లాడాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘నేను పాల్గొనే ఈవెంట్లలో మా అమ్మే నాకు భారీ మద్దతు. టోర్నీ సమయాల్లో నాకోసం అన్ని చూసుకోవడమే కాకుండా నాకు ఎమోషనల్ సపోర్ట్‌గా ఉంటుంది. ఆమె నాకు ఎంత ముఖ్యమో మాటల్లో చెప్పలేను. నా ఫేస్‌ను, బాడీ లాంగ్వేజ్‌ను చూసి ఆటలో నేను మంచి లేదా చెడు పొజిషన్‌లో ఉన్నానో ఆమె చెబుతుంది. నా కుటుంబం మద్దతు లేకుంటే నేను ఈ స్థాయిలో ఉండవాడిని కాదు. గేమ్‌కు ముందు భారతీయ ఆహారాన్ని తీసుకుంటాను. గేమ్‌కు ముందు మా అమ్మ వంట చేస్తుంది. ఇంట్లో చేసిన వంటకు ప్రాధాన్యత ఇస్తాను.’ అని వివరించాడు. అలాగే, ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ‌తో మీటింగ్ గురించి ప్రజ్ఞానంద మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది.

ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కాస్త కంగారుగా అనిపించినా.. ‘ప్రధాని నాతో చాలా సాధారణంగా ఉన్నారు. నా ఇంట్లో ఉన్న భావనను కలిగించారు. నా ట్రైనింగ్, టోర్నమెంట్లు, మా తల్లిదండ్రుల గురించి, మా నాన్న ఉద్యోగం తదితర విషయాలు అడిగారు. కొన్ని సలహాలు కూడా ఇచ్చారు.’ అని చెప్పుకొచ్చాడు. అలాగే, వరల్డ్ చాంపియన్‌ మాగ్నస్ కార్ల్‌సన్ గురించి మాట్లాడుతూ.. ‘అతన్ని కలిసే చాన్స్ వచ్చిన ప్రతిసారి అతని నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. అతను ఎలా ఆలోచిస్తాడో.. అతని మైండ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి అతనితో ఎక్కువగా చెస్ పొజిషన్స్ గురించి మాట్లాడుతుంటా.’ అని చెప్పాడు.

ఆటపై ఏకాగ్రత పెంచుకోవడానికి యోగా, ధ్యానం చేస్తానని తెలిపాడు. విశ్రాంతి కావాలనుకున్నప్పుడు సినిమాలు చూస్తానని, క్రికెట్ కూడా ఫాలో అవుతానని చెప్పాడు. టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. కాగా, చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకున్న రెండో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద సంచలనం సృష్టించాడు. తుది పోరులో వరల్డ్ నం.1 మాగ్నస్ కార్ల్‌సన్‌తో తలపడిన అతను గట్టి పోటీనిచ్చినప్పటికీ టై బ్రేక్‌లో ఓడి రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే.


Similar News