'అదీ.. లీడర్ షిప్ అంటే'.. ధోనీ తన సమస్య ఎవరికీ చెప్పలేదు : CSK CEO Kasi Viswanathan

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమేట్ ఎంఎస్ ధోనీ ప్రపంచ క్రికెట్‌కు లభించిన ఓ ఆణిముత్యమని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ కొనియాడారు.

Update: 2023-06-21 13:17 GMT

చెన్నై: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమేట్ ఎంఎస్ ధోనీ ప్రపంచ క్రికెట్‌కు లభించిన ఓ ఆణిముత్యమని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ కొనియాడారు. ఐపీఎల్ టోర్నమెంట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నేతృత్వం వహించిన ధోనీ తన మోకాలి గాయాన్ని సైతం కప్పిపుచ్చి జట్టును ముందుండి నడిపించాడని అభినందించారు. ఐపీఎల్ ప్రారంభం నుంచే మోకాలి నొప్పితో బాధపడుతున్నప్పటికీ ఏనాడూ ఆ విషయాన్ని జట్టు యాజమాన్యానికి గానీ, తోటి ఆటగాళ్లకు గానీ చెప్పలేదని, ఆ టోర్నీలో అన్ని మ్యాచ్‌ల్లో ఆడుతూ జట్టుకు విజయాలను అందించాడని ప్రశంసించారు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదవ ఐపీఎల్ టైటిల్ సాధించడంలో ధోనీ పాత్ర మరిచిపోలేనిదన్నారు. ప్రపంచ క్రికెట్‌లోనే ధోనీ అత్యున్నత నాయకుడని, భారత జట్టు కూడా అతడి నేతృత్వంలో సాధించిన అద్భుత విజయాలు దీనికి నిదర్శనమని చెప్పారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ట్రోఫీ అందించిన తర్వాత ధోనీ మోకాలి సర్జరీ చేయించుకున్నాడని, క్రికెట్ పట్ల అతడి అంకితభావానికి ఇది నిదర్శనమని చెప్పారు. మోకాలి శస్త్ర చికిత్స విజయవంతం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన కాశీ విశ్వనాథన్ అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


Similar News