వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతా : Mitchell Starc

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు.

Update: 2023-09-07 14:21 GMT

న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. 2015లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున చివరి ఐపీఎల్ ఆడిన అతను.. 8 ఏళ్ల తర్వాత భారత టీ20 లీగ్‌లో ఆడేందుకు సిద్ధమని ప్రకటించాడు. తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న స్టార్క్.. వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతానని తెలిపాడు. ‘8 ఏళ్లు గడిచిపోయాయి. కచ్చితంగా వచ్చే ఏడాది ఐపీఎల్‌లో పాల్గొంటా. టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది. ప్రపంచకప్‌కు ముందు ఐపీఎల్‌లో ఆడటం అద్భుతమైన అవకాశం’ అని చెప్పాడు. కాగా, 2014, 2015 సీజన్లలో స్టార్క్.. ఐపీఎల్‌లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాడు. 27 మ్యాచ్‌ల్లో 34 వికెట్లు తీశాడు. అనంతరం జాతీయ జట్టుకు ప్రాధాన్యత ఇస్తూ ఐపీఎల్‌కు దూరమయ్యాడు.

2018లో అతన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసినా.. గాయం కారణంగా ఆ సీజన్‌ నుంచి తప్పుకున్నాడు. మిచెల్ స్టార్క్ భార్య అలిసా హేలీని ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో యూపీ వారియర్స్ జట్టు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అరంగేట్రం డబ్ల్యూపీఎల్ సీజన్‌లో ఆమె జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. కాగా, ప్రస్తుతం స్టార్క్ గజ్జ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఈ ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన ఆసిస్ జట్టులో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అతనికి చోటు కల్పించింది.


Similar News