Paris Olympics : మను బాకర్ విజయానికి భగవద్గీత కారణమట.. ఎలాగో ఆమె మాటల్లోనే..
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతక బోణీ కొట్టింది.
దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతక బోణీ కొట్టింది. స్టార్ షూటర్ మను బాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్‌లో కాంస్యం నెగ్గి దేశానికి తొలి పతకం అందించింది. అంతేకాకుండా, షూటింగ్‌లో ఒలింపిక్స్ మెడల్ గెలిచిన తొలి భారత షూటర్‌గా రికార్డుకెక్కింది. మెడల్ ప్రజెంటేషన్ తర్వాత మను బాకర్ మాట్లాడుతూ ఒలింపిక్స్ పతకం గెలవడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఇది కలలా ఉందని చెప్పింది. అలాగే, భగవద్గీత తన విజయంలో సహాయపడిందని తెలిపింది.
‘భగవద్గీత చాలా ఎక్కువగా చదివాను. నా మనసులో ఏం అనిపిస్తుందో అదే చేస్తాను. మిగతావన్నీ విధికి వదిలేయండి. ఫలితాన్ని నియంత్రించలేం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్మ ఫలితంపై కాకుండా కర్మపై దృష్టి పెట్టాలని చెప్పాడు. ఫైనల్‌లో నా మైండ్‌లో కూడా అదే ఉంది. ‘మీ పని చేయండి.. మీ పని చేయండి. మిగతా వన్నీ వదిలేయండి’ అని అనుకున్నా.’ అని మను బాకర్ చెప్పుకొచ్చింది. టోక్యో ఒలింపిక్స్ తర్వాత చాలా నిరాశకు గురయ్యానని, ఆ పరిస్థితుల నుంచి బయటకు రావడానికి చాలా సమయం పట్టిందని, ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేనని తెలిపింది.