విరామాన్ని ఆస్వాదిస్తున్నా.. కానీ నా లక్ష్యం అదే : మను బాకర్
ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ షూటర్ మను బాకర్ రెండు కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే.
దిశ, స్పోర్ట్స్ : లాస్ ఏంజెల్స్ వేదికగా 2028లో జరిగే ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించడమే తన ముందున్న లక్ష్యమని భారత స్టార్ షూటర్ మను బాకర్ తెలిపింది. ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో మను రెండు కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె షూటింగ్‌కు కొన్ని రోజులు విశ్రాంతినిచ్చి వ్యక్తిగత అభిరుచులపై ఫోకస్ పెట్టింది.
తాజాగా ఓ జాతీయ మీడియాతో మను మాట్లాడుతూ.. ‘ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే నా గోల్. వచ్చే లాస్ ఏంజెల్స్ క్రీడల్లో నా కలను నేరవేర్చుకుంటా. ప్రస్తుతం నేను చిన్న విరామం తీసుకున్నా. నేను ఆట నుంచి విశ్రాంతి తీసుకుని ఎనిమిదన్నరేళ్లు అవుతుంది. కాబట్టి, మూడు లేదా నాలుగు నెలలు బ్రేక్ ఇచ్చా. ప్రస్తుతం ప్రతిదీ ఆస్వాదిస్తున్నా. ఆనందంగా, సరాదాగా ఉన్నా. విరామం అనంతరం లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ కోసం ట్రైనింగ్ మొదలుపెడతా. మిగతా టోర్నీల్లో కూడా పాల్గొంటా. అయితే, లక్ష్యం మాత్రం ఒలింపిక్సే.’అని మను తెలిపింది.