ఉత్కంఠ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన గెలుపు.. వన్డే సిరీస్ కైవసం

Update: 2024-06-19 16:50 GMT

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది. వరుసగా రెండో వన్డేలోనూ నెగ్గి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను చేజిక్కించుకుంది. అయితే, రెండో వన్డేలో గెలుపు కోసం హర్మన్‌ప్రీత్ సేన శ్రమించాల్సి వచ్చింది. ప్రత్యర్థి ముందు 326 పరుగుల భారీ లక్ష్యం పెట్టినా విజయం కోసం చెమటోడ్చక తప్పలేదు. బెంగళూరు వేదికగా జరిగిన రెండో వన్డేలో 4 పరుగుల తేడాతో భారత జట్టు గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు పరుగుల వరద పారించాయి. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి నాలుగు శతకాలు నమోదయ్యాయి. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 325/3 స్కోరు చేసింది. స్మృతి మంధాన(136), కెప్టెన్ హర్మన్‌ప్రీత్(103 నాటౌట్) శతకాలతో రెచ్చిపోయారు. అనంతరం ఛేదనకు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 321/6 స్కోరే చేసింది. కెప్టెన్ వోల్వార్డ్ట్(135 నాటౌట్), మారిజన్నె కాప్(114) సెంచరీలతో మెరిసినా జట్టును గెలిపించలేకపోయారు. నామమాత్రపు మూడో వన్డే ఆదివారం జరగనుంది.

వోల్వార్డ్ట్, కాప్ పోరాటం వృథా

326 పరుగుల కొండంత లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికాకు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లోనే ఓపెనర్ తాజ్‌మిన్ బ్రిట్స్(5)ను అరంగేట్ర క్రీడాకారిణి, తెలుగమ్మాయి అరుంధతి అవుట్ చేసి ప్రత్యర్థికి షాకిచ్చింది. ఆ తర్వాత అన్నేకే బోష్(18), సునె లూస్(12) నిరాశపర్చడంతో దక్షిణాఫ్రికా తడబడగా.. కెప్టెన్ వోల్వార్డ్ట్, మారిజన్నె కాప్ జట్టును ఆదుకున్నారు. అద్భుతమైన శతకాలతో రెచ్చిపోయిన వీరు జట్టును పోటీలోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో మారిజన్నె కాప్(114)ను దీప్తి అవుట్ చేసి ఆ జంటను వీడదీసింది. అయినప్పటికీ వోల్వార్డ్ ధాటిగా ఆడి జట్టును విజయం దిశగా నడిపించింది. ఆఖరి ఓవర్‌లో 11 పరుగులు కావాల్సి ఉండగా అద్భుతంగా బౌలింగ్ చేసిన పూజ.. డె క్లెర్క్(28), షాంగసే(0)లను అవుట్ చేయడంతోపాటు 6 పరుగులే ఇచ్చింది. ఆఖరి బంతికి 6 రన్స్ కావాల్సి ఉండగా వోల్వార్డ్(135 నాటౌట్) ఒక్క పరుగు కూడా తీయకపోవడంతో భారత జట్టులో సంబరాలు నెలకొన్నాయి. భారత బౌలర్లలో దీప్తి, పూజ రెండేసి వికెట్లు తీయగా.. అరుంధతి, మంధాన చెరో వికెట్ పడగొట్టారు.

మంధాన, హర్మన్‌ప్రీత్ శతకాలు

అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఇన్నింగ్స్‌లో స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ ఆటే హైలెట్. షెఫాలీ వర్మ(20), హేమలత(24)లతో మొదట మంధాన గట్టి పునాది వేసింది. ఆ తర్వాత ఆమెకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తోడైంది. వీరిద్దరూ సౌతాఫ్రికా బౌలర్లపై ఆకాశమే హద్దుగా చెలరేగారు. మంధాన ఎడాపెడా ఫోర్లతో రెచ్చిపోగా.. కౌర్ సైతం తానేం తక్కువ కాదంటూ దూకుడుగా ఆడింది. మూడో వికెట్‌కు ఈ జోడీ 171 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. 150 పరుగుల దిశగా వెళ్తున్న మంధాన(136) ఆ మార్క్‌ను తృటిలో చేజార్చుకుంది. హర్మన్‌ప్రీత్(103 నాటౌట్) చివరి వరకు నిలబడి సెంచరీ పూర్తి చేయడంతోపాటు స్కోరును 300 దాటింది.

స్కోరుబోర్డు

భారత్ మహిళల ఇన్నింగ్స్ : 325/3(50 ఓవర్లు)

స్మృతి మంధాన(సి)తాజ్‌మిన్ బ్రిట్స్(బి)మ్లాబా 136, షెఫాలీ(సి)మాసాబాటా క్లాస్(బి)మ్లాబా 20, హేమలత(సి)అన్నేకే బోష్(బి)మాసాబాటా క్లాస్ 24, హర్మన్‌ప్రీత్ 103, రిచా ఘోష్ 25 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 17.

వికెట్ల పతనం : 38-1, 100-2, 271-3

బౌలింగ్ : ఆయబొంగ ఖాక(10-2-51-0), మాసాబాటా క్లాస్(10-0-67-1), నాడినె డె క్లెర్క్(8-1-50-0), మ్లాబా(10-0-51-2), షాంగసే(6-0-57-0), అన్నేకే బోష్(1-0-10-0), సునె లూస్(5-0-36-0)

సౌతాఫ్రికా మహిళల ఇన్నింగ్స్ : 321/6(50 ఓవర్లు)

వోల్వార్డ్ట్ 135 నాటౌట్, తాజ్‌మిన్ బ్రిట్స్(బి)అరుంధతి 5, అన్నేకే బోష్(సి)రోడ్రిగ్స్(బి)దీప్తి 18, సునె లూస్(సి)రిచా ఘోష్(బి)మంధాన 12, మారిజన్నె కాప్(సి)పూజ(బి)దీప్తి 114, నాడినె డె క్లెర్క్(సి)అరుంధతి(బి)పూజ 28, షాంగసే(సి)హర్మన్‌ప్రీత్(బి)పూజ 0, డె రిడ్డెర్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 9.

వికెట్ల పతనం : 14-1, 54-2, 67-3, 251-4, 320-5, 320-6

బౌలింగ్ : పూజ(7-0-54-2), అరుంధతి(8-0-62-1), దీప్తి(10-1-56-2), మంధాన(2-0-13-1), శోభన(9-0-53-0), షెఫాలీ(4-0-26-0)


Similar News