మలేసియా మాస్టర్స్‌లో సింధు జోరు.. సెమీస్‌కు క్వాలిఫై

Update: 2023-05-26 16:26 GMT

కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జోరు కొనసాగుతోంది. ఉమెన్స్ సింగిల్స్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో సింధు 21-16, 13-21, 22-20 తేడాతో చైనాకు చెందిన జాంగ్ యిమాన్‌పై పోరాడి గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. సింధు, జాంగ్ యిమాన్ మధ్య గంట 14 నిమిషాలపాటు మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలి గేమ్‌లో మొదట 0-5 తేడాతో వెనుకబడిన సింధు ఆ తర్వాత పుంజుకుని గేమ్‌ను దక్కించుకుని శుభారంభం చేసింది. అయితే, రెండో గేమ్‌లో సింధుకు చైనా షట్లర్ షాక్ ఇవ్వడంతో గెలుపు నిర్ణయాత్మక మూడో గేమ్‌కు దారితీసింది. మూడో గేమ్‌లో ఇద్దరు నువ్వానేనా అన్నట్టు పోటీపడ్డారు.

ఆరంభం నుంచి సింధు కాస్త లీడ్‌లో ఉండగా 12-12 తర్వాత ఆధిక్యం మారుతూ వచ్చింది. ఈ క్రమంలో 20-20తో స్కోర్లు సమమైన తర్వాత సింధు వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. సెమీస్‌లో ఆమె ఇండోనేషియా షట్లర్ టుంజంగ్‌తో తలపడనుంది. అలాగే, స్టార్ ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్ సైతం సెమీస్‌లో అడుగుపెట్టాడు. మెన్స్ సింగిల్స్‌ క్వార్టర్స్ మ్యాచ్‌లో ప్రణయ్ 25-23, 18-21, 21-13 తేడాతో జపాన్‌కు చెందిన కెంటా నిషిమోటోపై గెలుపొందాడు.

తొలి గేమ్‌ను పోరాడి గెలుచుకున్న ప్రణయ్.. రెండో గేమ్‌ కోసం చివరి వరకూ ప్రయత్నించి కోల్పోయాడు. అయితే, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మాత్రం సత్తాచాటాడు. ఆరంభంలో లీడ్ మారుతూ వచ్చినా.. ఆ తర్వాత వరుసగా పాయింట్లు గెలుచుకుని గేమ్‌ను ఏకపక్షం చేశాడు. మరో స్టార్ ఆటగాడు, తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ ప్రయాణం క్వార్టర్స్‌లోనే ముగిసింది. ఇండోనేషియా ప్లేయర్ క్రిస్టియన్ అదినాట చేతిలో 16-21, 21-16, 21-11 తేడాతో శ్రీకాంత్ పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్ర్కమించాడు.

Tags:    

Similar News