వినేశ్ విషయంలో ఎలాంటి కుట్ర లేదు.. రాజకీయం చేయద్దు : అథ్లెటిక్స్ ఫెడరేషన్
పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటులో ఎలాంటి కుట్ర లేదని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది.
దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటులో ఎలాంటి కుట్ర లేదని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. అదనపు బరువు కారణంగా వినేశ్‌పై ఒలింపిక్స్ నిర్వాహకులు అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఆమె విషయంలో ఏదైనా కుట్ర జరిగిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజింగ్ ఒలింపిక్ మెడలిస్ట్, దిగ్గజ బాక్సర్ విజేందర్ సింగ్ కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశాడు. తాజాగా అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆదిల్ సుమరీవాలా ఆ వార్తలను తోసిపుచ్చారు. ఇది సాంకేతికతకు సంబంధించిన అంశమని, దీన్ని రాజకీయం చేయొద్దని కోరారు. ‘ఇందులో ఎలాంటి కుట్ర లేదు. బరువు అధికంగా ఉన్నారంటే బరువు ఎక్కువ ఉన్నట్లే. ఇది సాంకేతికతకు సంబంధించిన అంశం. 53 కేజీల కేటగిరీలో పోటీపడే ఆమె తన కేటగిరీని తగ్గించుకుంది. 50 కేజీల కేటగిరీలో పోటీపడేటప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అదనపు బరువు విషయంలో ఎలాంటి సడలింపు ఉండదు.’ అని తెలిపారు.