అతడు చెత్త షాట్ ఆడి ఔట్ కావడం ఆశ్చర్యం కలిగించింది : వసీం జాఫర్

ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ ఆటతీరును మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తప్పుబట్టాడు.

Update: 2023-06-14 14:40 GMT

ముంబై: ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ ఆటతీరును మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తప్పుబట్టాడు. ‘‘భారత జట్టు 280 పరుగుల లక్ష్యాన్ని సాధించాల్సిన తరుణంలో కోహ్లీ వంటి సీనియర్ ఆటగాడిపై సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాల్సిన బాధ్యత ఉంది. కానీ.. అతడు చెత్త షాట్ ఆడి ఔట్ కావడం ఆశ్చర్యం కలిగించింది’’ అని వసీం జాఫర్ అన్నాడు. ‘‘ఆ మ్యాచ్ నాలుగో రోజు భారత రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ మంచి ఫామ్‌లో కనిపించాడు. అయితే.. 5వ రోజు మ్యాచ్‌లో భారత జట్టు 280 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సిన సమయంలో ఘనమైన ప్రారంభాన్ని అందించాల్సిన కోహ్లి బ్యాట్ ను నిర్లక్ష్యంగా ఝుళిపించి అవుట్ అయ్యాడు. ఆఫ్ స్టంప్ వెలుపల చాలా వైడ్‌గా పడిన బంతిని అతడు టచ్ చేయకుండా ఉండాల్సింది.

అతని షాట్ ఎంపిక చాలా మంది మాజీ క్రికెటర్లను, అభిమానులను నిరాశపరిచింది. అప్పటి వరకు ఆత్మవిశ్వాసంతో, క్రమశిక్షణతో ఆడిన కోహ్లీ చెత్త షాట్ కొట్టడం ఆశ్చర్యం కలిగించింది. ఆస్ట్రేలియా బౌలర్లు తరచూ ఆఫ్ స్టంప్ వెలుపల విసిరిన బంతులను ఓపికతో వదిలేసిన కోహ్లీ.. భారీ ఇన్నింగ్స్‌తో భారత్‌ను గట్టెక్కించాల్సిన కీలక సమయంలో అటాంటి బంతిని ఆడటం సరికాదు. అది చెత్త షాట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తొలి ఇన్నింగ్స్‌లో మంచి బంతికి అవుట్ అయిన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్‌లో ఆటపై నియంత్రణ కోల్పోవడం నిరాశ కలిగించింది’’ అని జాఫర్ వివరించాడు. కోహ్లీ షాట్‌పై క్రికెట్ లిజెండర్ సునీల్ గవాస్కర్ కూడా విరుచుకుపడ్డాడు. సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాల్సిన సమయంలో కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడు ఇలాంటి చెత్త షాట్‌ను ఆడతాడని తాను ఊహించలేదన్నాడు.


Similar News