నిజమండీ బాబూ..! కోహ్లీ, బాబర్ ఒకే టీంలో ఆడబోతున్నారు
కింగ్ కోహ్లీ, బాబర్ అజామ్ ఇద్దరూ ఒకే జెర్సీలో బరిలోకి దిగి ఒకే టీం కోసం ఆడితే ఎలాగుంటుంది..?
దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ దాయాదులు ఇండియా (India), పాకిస్తాన్ (Pakistan) మధ్య క్రికెట్ ఫైట్ అంటే ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఇక రెండు జట్లలో స్టార్ ప్లేయర్ల మధ్య ఫైట్ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అంతా వరల్డ్ క్రికెట్లో విరాట్ కోహ్లీ (Virat Kohli)నే కింగ్ అంటూ ఆకాశానికెత్తేస్తే.. కాదు మా బాబర్ అజామే(Babar Azam) వరల్డ్ బెస్ట్ బ్యాటర్ అంటూ పాకిస్తాన్ ప్లేయర్లు ఫైట్‌కి రెడీ అయిపోతారు. అయితే.. ఒక్కసారి ఊహించండి.. కింగ్ కోహ్లీ, బాబర్ అజామ్ ఇద్దరూ ఒకే జెర్సీలో బరిలోకి దిగి ఒకే టీం కోసం ఆడితే ఎలాగుంటుంది..? వినడానికే విచిత్రంగా ఉంది కదా..? కానీ అతి త్వరలో ఇది నిజమయ్యేలా కనిపిస్తోంది. దానికి ఆఫ్రో-ఆసియా కప్ (Afro-Asia Cup) వేదికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదేం కప్..? ఈ పేరే ఎప్పుడూ వినలేదే..! అని ఆశ్చర్యపోకండి. ఈ కప్‌ని దాదాపు రెండు దశాబ్దాల క్రితం అంటే 2005, 2007ల్లో నిర్వహించారు. అయితే ఆ తర్వాత వివిధ కారణాల వల్ల దీనిని నిలిపివేశారు. ఇందులో ఆసియా దేశాల క్రికెటర్లు (Asian Contries Cricketers) ఒక జట్టుగా, ఆఫ్రికా దేశాల క్రికెటర్లు (African Contries Cricketers) మరో జట్టుగా పోటీపడేవాళ్లు. అప్పట్లో మన వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, ఇంజామామ్ ఉల్ హక్, జహీర్ ఖాన్, షోయబ్ అక్తర్, అనిల్ కుంబ్లే, షహిద్ అఫ్రిది అందరూ కలిసి ఆసియా జట్టుకు ఆడారు. అలాగే ఆఫ్రికా జట్టు తరఫున షాన్ పొలాక్, జాక్వెస్ కలిస్, టాటెండా తైబు వంటి ఆటగాళ్లు బరిలోకి దిగారు.
తాజాగా ఈ టోర్నీని మళ్లీ నిర్వహించాలని ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్ భావిస్తుందట. ఈ టోర్నీని మళ్లీ నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్, ఆఫ్రికా క్రికెట్ కౌన్సిల్ భావిస్తున్నాయి. దీనికోసం 2022లోనే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న బీసీసీఐ కార్యదర్శి జై షా (Asia Cricket Council President Jai Shah)తో అప్పటి ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సుమోద్ దామోదర్ (Africa Cricket Association President Sumod Damodar) , ఏసీసీ డెవలప్‌మెంట్ హెడ్ మహింద వల్లిపురం చర్చలు కూడా జరిపారట. ఇక తాజాగా మహింద ఐసీసీ బోర్డు (ICC Board) సభ్యునిగా తిరిగి ఎన్నికవడం, జై షా ఐసీసీ చైర్మన్ కావడంతో ఆఫ్రో-ఆసియా కప్‌ను నిర్వహించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఏసీసీ మాజీ అధ్యక్షుడు దామోదర్ కూడా స్వయంగా చెప్పారు. మరి నిజంగానే ఈ టోర్నీ మళ్లీ స్టార్ట్ అయితే మన కోహ్లీ, పాకిస్తాన్ బాబర్ ఒకే టీంలో కనిపించే అవకాశం లేకపోలేదు.