లక్నోతో రాహుల్ బంధం ముగిసినట్టేనా?.. ఆ జట్టు స్పిన్నర్ అమిత్ మిశ్రా ఏమన్నాడంటే?
లక్నో సూపర్ జెయింట్స్‌తో కేఎల్ రాహుల్ బంధం ముగిసినట్టేనా?. కెప్టెన్‌గానే కాకుండా టీమ్ నుంచి కూడా అతను వైదొలుగుతున్నాడా?.. ఫ్రాంచైజీ కూడా అతన్ని తప్పించే యోచనలోనే ఉన్నదా?.. అంటే క్రికెట్ వర్గాల్లో అవుననే సమాధానమినే వినిపిస్తున్నది.
దిశ, స్పోర్ట్స్ : లక్నో సూపర్ జెయింట్స్‌తో కేఎల్ రాహుల్ బంధం ముగిసినట్టేనా?. కెప్టెన్‌గానే కాకుండా టీమ్ నుంచి కూడా అతను వైదొలుగుతున్నాడా?.. ఫ్రాంచైజీ కూడా అతన్ని తప్పించే యోచనలోనే ఉన్నదా?.. అంటే క్రికెట్ వర్గాల్లో అవుననే సమాధానమినే వినిపిస్తున్నది. తాజాగా లక్నో క్రికెటర్ అమిత్ మిశ్రా ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చే వ్యాఖ్యలు చేశాడు. లక్నో ఫ్రాంచైజీ కొత్త కెప్టెన్ కోసం చూస్తున్నదని వ్యాఖ్యానించాడు. దీంతో లక్నోతో రాహుల్ బంధం ముగిసినట్టే? అని వార్తలు వస్తున్నాయి.
2022లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రెండు జట్లలో లక్నో సూపర్ జెయింట్స్ ఒకటి. ఆ సీజన్ నుంచి లక్నోకు రాహుల్ కెప్టెన్‌గా ఉన్నాడు. అరంగేట్ర సీజన్‌లోనే లక్నోను ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. గతేడాది కూడా ఆ జట్టు నాకౌట్ రౌండ్‌కు చేరుకుంది. అయితే, ఈ సీజన్‌లో లక్నో పేలవ ప్రదర్శన చేసింది. 14 మ్యాచ్‌ల్లో ఏడింట మాత్రమే గెలిచి 7వ స్థానంతో సరిపెట్టింది. గ్రూపు దశలో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఘోర పరాజయం చవిచూసింది. 166 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడం పక్కనపెడితే సన్‌రైజర్స్ ఆ టార్గెట్‌ను కేవలం 9.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. దీంతో జట్టు ప్రదర్శన పట్ల లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా అసంతృప్తి వ్యక్తి చేశాడు. మైదానంలోనే రాహుల్‌ను నిలదీశాడు. ఆ ఘటన అప్పుడు చర్చనీయాంశమైంది. ఓనర్ అయినంత మాత్రాన మైదానంలోనే నిలదీయడం సరైందని కాదని మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయపడ్డారు. దీంతో అప్పటి నుంచే రాహుల్ లక్నోను వీడతాడన్న ప్రచారం జరుగుతోంది.
అమిత్ మిశ్రా ఏమన్నాడంటే?
లక్నో గెల్ స్పిన్నర్ అమిత్ మిశ్రా 2022 నుంచి లక్నో జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న అతను కీలక వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ కంటే బెటర్ కెప్టెన్ కోసం లక్నో ఫ్రాంచైజీ కచ్చితంగా వెతుకుందన్నాడు. ‘టీ20 జట్టుతో కలిసి ఆలోచించే వారే కెప్టెన్‌గా ఉండాలి. రాహుల్‌ను కెప్టెన్‌గా తొలగించడాన్ని వారు కచ్చితంగా ఆలోచిస్తారు. లక్నో వంద శాతం బెటర్ కెప్టెన్ కోసం చూస్తోంది.’ అని వ్యాఖ్యానించాడు. వచ్చే సీజన్ కంటే ముందు మెగా వేలం జరగనుంది. కాబట్టి, ఏదైనా జరగొచ్చని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాహుల్ వేలంలోకి వస్తే భారీ ధర పలుకుతాడని చెబుతున్నారు.