అదొక్కటే లక్ష్యంగా పెట్టుకున్నా : కేఎల్ రాహుల్

Update: 2023-10-09 16:50 GMT

చెన్నయ్ : వన్డే ప్రపంచకప్‌ను టీమ్ ఇండియా విజయంతో ఆరంభించింది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలుపొందిన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో రాహుల్ మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో నిరాశజనక ప్రదర్శన తర్వాత తాను దారుణమైన ట్రోలింగ్‌కు గురయ్యానని, ఆ సమయంలో చాలా బాధపడ్డానని చెప్పాడు. ‘ప్రతి మ్యాచ్ తర్వాత నాపై చాలా విమర్శలు వచ్చేవి. నేను మరి చెత్త ప్రదర్శన చేయలేదు. కానీ, విమర్శలు ఎందుకు వస్తున్నాయో అర్థమయ్యేది కాదు. అప్పుడు నేను చాలా బాధపడ్డాను.’ అని తెలిపాడు. అలాగే, ఐపీఎల్‌లో గాయంపై స్పందిస్తూ.. ‘తాను 4-5 నెలలు ఆటకు దూరంగా ఉంటానని నాకు తెలుసు.

అలాగే, వరల్డ్ కప్ ఆడటంపై సందిగ్ధం ఉంది. నా కెరీర్‌లో చాలా సార్లు గాయపడ్డాను. సర్జరీలు చేయించుకున్నాను. గాయం నుంచి తిరిగి రావడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఎలా రావాలో కూడా తెలుసు. వరల్డ్ కప్‌కు ముందు జట్టులోకి రావాలని, స్వదేశంలో ప్రపంచకప్ ఆడాలనేది లక్ష్యంగా పెట్టుకున్నా. ప్రపంచకప్ గెలవడమనే ఆలోచనే నాకు ప్రేరణ. ప్రతి ఉదయం ఆ ఆలోచనతోనే లేచేవాడిని. జిమ్‌లో కసరత్తులు చేసేవాడిని.’అని రాహుల్ చెప్పుకొచ్చాడు. అలాగే, స్వదేశంలో ప్రపంచకప్ ఆడాలనేది ప్రతి క్రికెటర్ కల అని, దానికి ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పాడు.


Similar News