ఆ ఇంటర్వ్యూ నన్నెంతో భయపెట్టింది : 2019నాటి వివాదంపై ఓపెన్ అయిన కేఎల్ రాహుల్

2019లో ‘కాఫీ విత్ కరణ్’ షోలో రాహుల్, పాండ్యా మహిళలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి.

Update: 2024-08-24 12:30 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా 2019ని ఎప్పటికీ మర్చిపోలేరేమో. ‘కాఫీ విత్ కరణ్’ షోలో వారు మహిళలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. రాహుల్, పాండ్యాలను బీసీసీఐ సస్పెండ్ కూడా చేసింది. నాలుగేళ్ల తర్వాత తాజాగా రాహుల్ 2019 వివాదంపై స్పందించాడు. ఓ పాడ్‌కాస్ట్‌లో రాహుల్ మాట్లాడుతూ.. ఆ ఇంటర్వ్యూ తన కెరీర్‌పై ఎలా ప్రభావం చూపిందో వివరించాడు.

‘నన్ను బాగా ట్రోల్ చేసేవారు. సాధారణంగా ట్రోలింగ్‌ను పట్టించుకోను. కానీ, కొన్నేళ్ల క్రితం నన్ను దారుణంగా ట్రోల్ చేశారు. కూర్చున్నా, నిల్చున్నా ట్రోల్ చేశారు. ఒక్క ఇంటర్వ్యూను నన్ను పూర్తిగా మార్చివేసింది. 100 మందిలో ఉన్నా నన్ను గుర్తుపట్టేవారు. టీమ్ ఇండియాకు ఆడటం వల్లే నాకు ఆ ఆత్మవిశ్వాసం వచ్చింది. కానీ, ఇప్పుడు అలా ఉండలేకపోతున్నా. ఆ ఇంటర్వ్యూ అంతలా భయపెట్టింది. జట్టు నుంచి సస్పెండ్ అయ్యా. స్కూల్‌లో నన్నెప్పుడు సస్పెండ్ చేయలేదు. శిక్షించలేదు. ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు.’అని రాహుల్ చెప్పుకొచ్చాడు. కాగా, రాహుల్ ఇటీవల శ్రీలంకతో వన్డే సిరీస్‌తో తిరిగి జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌‌కు జట్టులో చోటు పదిలం చేసుకునేందుకు ప్రస్తుతం దులీప్ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్నాడు. 

Tags:    

Similar News