క్రికెట్‌కు మరో భారత స్టార్ క్రికెటర్ గుడ్ బై.. ధోనీ స్టైల్‌లో చెప్పిన కేదార్ జాదవ్

భారత ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Update: 2024-06-03 12:46 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోమవారం సోషల్ మీడియా వేదికగా అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించాడు. 39 ఏళ్ల జాదవ్ 2014లో శ్రీలంకపై అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. కెరీర్‌లో అతను టీమ్ ఇండియా తరపున 82 మ్యాచ్‌లు ఆడాడు. 73 వన్డేల్లో 1,389 పరుగులు, 9 టీ20ల్లో 122 రన్స్ చేశాడు. స్పిన్ ఆల్‌రౌండర్ అయిన జాదవ్ 27 వన్డే వికెట్లు కూడా పడగొట్టాడు. 2020లో భారత్‌ తరపున చివరిసారిగా ఆడిన అతను.. ఆ తర్వాత జాతీయ జట్టులో కోల్పోయాడు. నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత తాజాగా అతను క్రికెట్‌కు గుడ్ చెప్పాడు.

జాదవ్ తన రిటైర్మెంట్‌ను ధోనీ స్టైల్‌లో ప్రకటించాడు. 2020లో ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అప్పుడు అతను ‘మీ ప్రేమ, మద్దతుకు థాంక్స్. 19.29 గంటల నుంచి నేను రిటైరైనట్టు పరిగణించండి.’ అని పోస్టు చేశాడు. తన కెరీర్‌కు సంబంధించిన ఫొటోలతో స్లైడ్ షో, దానికి సాంగ్ జతచేశాడు. జాదవ్ కూడా అదే తరహాలో క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘నా కెరీర్ మొత్తం సపోర్ట్ చేసినందుకు, ప్రేమను పంచినందుకు అందరికీ థాంక్స్. 15.00 గంటల నుంచి నేను అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైరైనట్టు పరిగణించండి’ అని పేర్కొన్నాడు.

అలాగే, తన కెరీర్‌కు సంబంధించిన ఫొటోలతో స్లైడ్ షో పోస్టు చేసిన అతను దానికి బ్యాక్ గ్రౌండ్‌లో కిశోర్ కుమార్ సాంగ్ జత చేశాడు. ఐపీఎల్‌లో 2018-20 మధ్య ధోనీ నాయకత్వంలో జాదవ్‌కు చెన్నయ్‌కు ఆడిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో బెంగళూరు, చెన్నయ్, హైదరాబాద్, ఢిల్లీ, కొచి ట‌స్కర్స్ కేర‌ళ‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 95 మ్యాచ్‌ల్లో 1,208 పరుగులు చేశాడు. 


Similar News