నేషనల్ ఇంటర్‌ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయికి స్వర్ణం

నేషనల్ ఇంటర్‌ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి యర్రాజి జ్యోతి సత్తాచాటింది.

Update: 2023-06-16 17:08 GMT

భువనేశ్వర్ : నేషనల్ ఇంటర్‌ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి యర్రాజి జ్యోతి సత్తాచాటింది. ఒడిశాలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల 100 మీటర్ల రేసులో జ్యోతి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. జ్యోతి 11.46 సెకన్లలో రేసును ముగించి అగ్రస్థానంలో నిలిచింది. ఏషియన్ చాంపియన్‌షిప్ బ్రాంజ్ మెడలిస్ట్, ఒడిశాకు చెందిన శ్రబని నంది(11.59 సెకన్లు)ని రెండో స్థానానికి నెట్టి స్వర్ణ పతకం దక్కించుకుంది. అయితే, ఆసియా గేమ్స్‌కు ఆమె అర్హత సాధించలేకపోయింది. ఆసియా గేమ్స్‌కు అర్హత ప్రమాణంగా 11.42 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉండగా.. జ్యోతి తృటిలో బెర్త్‌ను చేజార్చుకుంది.

రెండో స్థానంతో సరిపెట్టిన శ్రబని నంది రజతం గెలుచుకోగా.. హర్యానాకు చెందిన హిమశ్రీ రాయ్(11.71 సెకన్లు) కాంస్య పతకం దక్కించుకుంది. మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో మరో తెలుగమ్మాయి మల్లాల అనూష కాంస్య పతకం సాధించింది. ఆఖరి ప్రయత్నంలో 13.24 మీటర్ల ప్రదర్శనతో ఆమె మూడో స్థానంలో నిలిచింది. కేరళకు చెందిన షీనా(13.60 మీటర్లు) స్వర్ణం గెలుచుకోగా.. సహచర అథ్లెట్ నయన జేమ్స్(13.33 మీటర్లు) రజతం సాధించింది.


Similar News