హెచ్.సీ.ఏ ప్రక్షాళన షురూ.. అధికారులతో జస్టీస్ నాగేశ్వరరావు భేటీ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రక్షాళన కోసం సుప్రీం కోర్టు నియమించిన రిటైర్డ్ జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు రంగంలోకి దిగారు.
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రక్షాళన కోసం సుప్రీం కోర్టు నియమించిన రిటైర్డ్ జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు రంగంలోకి దిగారు. శుక్రవారం హెచ్‌సీఏ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్, మాజీ ప్రెసిడెంట్ శివలాల్ యాదవ్, సెక్రటరీ విజయానంద్, జాన్ మనోజ్, అపెక్స్ కౌన్సిల్ మెంబర్ అనురాధ, మాజీ ట్రెజరర్ నరేశ్ అగర్వాల్‌తో సహా ఇతర అధికారులతో వరుసగా భేటీ అయ్యారు. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అన్ని పెండింగ్ అంశాలపై నాగేశ్వరరావు ఫోకస్ పెట్టినట్లు సెక్రటరీ జాన్ మనోజ్ వెల్లడించాడు. 2019-2022కు సంబంధించిన హెచ్‌సీఏ అకౌంట్స్‌పై ఆడిటింగ్ నిర్వహించాలని నాగేశ్వరరావును కోరినట్లు శివలాల్ యాదవ్ తెలిపాడు.
ఈ సందర్భంగా శివలాల్ యాదవ్ మాట్లాడుతూ.. హెచ్‌సీఏలో జరిగిన ఆకృత్యాల గురించి నేను నాగేశ్వర రావు దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. వాటికి ఎవరు బాధ్యత వహిస్తారో చూడాలన్నారు. బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు దాదాపు రూ.100 కోట్లు రావాలని పేర్కొన్నారు. కానీ ఏజీఎమ్‌లో అకౌంట్స్‌ను ఆమోదించకపోవడంతో బోర్డు నిధులు రిలీజ్ చేయలేదని, ఇది అత్యంత బాధాకర విషయమని పేర్కొన్నారు. అందుకే ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికైన సంఘం ఉండాలని నేను జస్టిస్ దృష్టికి తీసుకెళ్లాలని ఆయన చెప్పుకొచ్చాడు. పదవీకాలం ముగిసినా కూడా ఆఫీస్ బేరర్లు ఇంకా పదవుల్లో కొనసాగుతున్నారని ఫిర్యాదు చేశాడు.
హెచ్‌సీఏలో ఏర్పడిన వివాదాల పరిష్కారం మొదలు గడువు ముగిసిన కార్యవర్గం స్థానంలో కొత్త కమిటీ కొలువుదీరే వరకు అసోసియేషన్‌ను సజావుగా నడిపే బాధ్యతలను మాజీ జడ్జి నాగేశ్వరరావుకు సుప్రీం కోర్టు అప్పగించిన విషయం తెలిసిందే. ఇక ఎన్నికల నిర్వహణకు ముందు పాత ఓటర్ల జాబితాను నాగేశ్వరరావు ప్రక్షాళించాల్సిన అవసరముంది. ప్రస్తుతం హెచ్‌సీఏ ఓటర్ల జాబితాలో 226 మంది సభ్యులు ఉన్నారు.
కాగా.. అజారుద్దీన్ అధ్యక్షతన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో లెక్కకు మిక్కిలి అక్రమాలు చోటుచేసుకున్నాయని సుప్రీంకోర్టు నియమించిన పర్యవేక్షక కమిటీ గుర్తించింది. సంఘం సభ్యులు కొందరు ఒక్కొక్కరు ఏడు నుంచి ఎనిమిది క్లబ్‌లు కలిగి ఉన్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించడంపై జస్టిస్ నాగేశ్వరరావు ప్రధానంగా దృష్టి సారించే అవకాశముంది.