అందుకే జడేజా అంటే బ్యాటర్లకు భయం.. ప్రశంసలు కురిపించిన జాంటీ రోడ్స్

టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బెస్ట్ ఆల్‌రౌండర్ అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

Update: 2024-08-31 12:11 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బెస్ట్ ఆల్‌రౌండర్ అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. బంతితో, బ్యాటుతో అతను భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఫీల్డర్‌గా కూడా జడేజా మైదానంలో అద్భుతాలు చేసిన సందర్భాలు ఎన్నో. బంతి అతని దగ్గరికి వెళ్తుందంటే బ్యాటర్లకు దడే. అంత వేగంగా బంతిని అందుకుని అద్భుతమైన త్రోతో బ్యాటర్లను పెవిలియన్‌కు పంపుతాడు. తాజాగా జడేజా ఫీల్డింగ్ నైపుణ్యాలపై ఆల్ టైం గ్రేటెస్ట్ ఫీల్డర్స్‌లో ఒకరైన సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ ప్రశంసలు కురిపించాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాంటీ రోడ్స్.. ఆధునిక క్రికెట్‌లో జడేజా బెస్ట్ ఫీల్డర్ అని కితాబిచ్చాడు.

‘ఫీల్డర్‌గా నేనెప్పుడు అభిమానించే ఇద్దరు ప్లేయర్లు సురేశ్ రైనా, రవీంద్ర జడేజా. వారిద్దరూ భారత అత్యుత్తమ ఫీల్డర్లు. కానీ, ఆధునిక క్రికెట్ గురించి మాట్లాడుకున్నప్పుడు బెస్ట్ ఫీల్డర్ కచ్చితంగా జడేజానే. అందరూ అతన్ని సర్ జడేజా అని పిలుచుకుంటారు. మిడ్ వికెట్, లాంగ్ ఆన్, షార్ట్ కవర్ ఏ స్థానంలోనైనా అతను ఫీల్డింగ్ చేయగలడు. అతను వేగంగా పరుగెత్తగలడు. అందుకే, బంతి అతని దగ్గరి వెళ్తుందంటేనే భయపడతారు. క్యాచ్ పట్టడం, విసరడం ముఖ్యమే కానీ, బంతిని ఎంత త్వరగా చేరుకున్నామన్నది ఇంకా కీలకం. అందుకే అతను బెస్ట్. ’అని చెప్పుకొచ్చాడు. కాగా, టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు అతనికి విశ్రాంతినివ్వగా.. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

Tags:    

Similar News