భారత దిగ్గజ బౌలర్ రికార్డును బ్రేక్ చేసిన అండర్సన్.. 72 ఏళ్ల తర్వాత సాధించాడు

James Anderson becomes oldest pacer to play a match in India

Update: 2024-02-02 12:54 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియాతో రెండో టెస్టులో ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ అరుదైన రికార్డు సాధించాడు. భారత గడ్డపై 72 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు. భారత్‌లో టెస్టు మ్యాచ్ ఆడిన అతిపెద్ద వయసు ఉన్న పేసర్‌గా నిలిచారు. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు అండర్సన్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. రెండో టెస్టుకు మార్క్‌వుడ్‌ను పక్కనపెట్టిన ఇంగ్లాండ్ టీమ్ అండర్సన్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలి రోజు 17 ఓవర్లు వేసిన అతను ఒక వికెట్ పడగొట్టాడు. 30 పరుగులు మాత్రమే ఇవ్వగా.. మూడు మెయిడెన్ ఓవర్లు కూడా వేశాడు. శుభ్‌మన్ గిల్ అతని బౌలింగ్‌లోనే ఫోక్స్ పట్టిన క్యాచ్‌కు వెనుదిరిగాడు.

ఇప్పటివరకు భారత మాజీ క్రికెటర్ లాలా అమర్‌నాథ్ భారత గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడిన అతిపెద్ద వయసు కలిగిన పేసర్‌గా ఉన్నాడు. 1952లో అతను 41 ఏళ్ల 92 రోజుల వయసులో పాకిస్తాన్‌పై టెస్టు మ్యాచ్ ఆడాడు. తాజాగా 41 ఏళ్ల 187 రోజుల అండర్సన్‌ దీన్ని అధిగమించాడు. భారత గడ్డపై 72 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసి టెస్టు మ్యాచ్ ఆడిన అతిపెద్ద వయస్కుడిగా నిలిచాడు. అలాగే, అండర్సన్ మరో రికార్డు కూడా ఖాతాలో వేసుకున్నాడు. భారత గడ్డపై ఆడిన ఐదో అతి పెద్ద వయస్కుడిగానూ నిలిచాడు. ఈ జాబితాలో జింబాబ్వేకు చెందిన జాన్ ట్రైకోస్ అగ్రస్థానంలో ఉన్నాడు. 1993లతో 45 ఏళ్ల 304 రోజుల వయసులో భారత్‌లో టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ జాబితాలో భారత మాజీ క్రికెటర్ వినూ మన్కడ్ 1949లో 41 ఏళ్ల 305 రోజుల వయసులో టెస్టు ఆడి నాలుగో స్థానంలో ఉన్నాడు.

కాగా, అండర్సన్‌కు ఇది 184వ టెస్టు మ్యాచ్‌. భారత గడ్డపై 14వ మ్యాచ్. గిల్ వికెట్‌తో అతను టీమ్ ఇండియాపై 35వ వికెట్ తీసుకున్నాడు. మొత్తంగా అతను 691 వికెట్లు తీశాడు. మరో 7 వికెట్లు తీస్తే 700 వికెట్ల క్లబ్‌లో చేరతాడు. ప్రస్తుతం అతను టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లో జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. అతని కంటే ముందు శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్(800 వికెట్లు) టాప్ వికెట్ టేకర్‌గా కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్(708 వికెట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. మరో 7 వికెట్లు తీస్తే 700 వికెట్ల క్లబ్‌లో చేరిన మూడో బౌలర్‌గా అండర్సన్ రికార్డు నెలకొల్పుతాడు. మరి, భారత్‌తో మిగతా టెస్టు సిరీస్‌లో అండర్సన్‌ ఈ ఘనత సాధిస్తాడో లేడో చూడాలి. 

Tags:    

Similar News