ఐవీపీఎల్‌లో ఫైనల్‌కు దూసుకొచ్చిన రైనా, సెహ్వాగ్ జట్లు.. రేపు ఫైనల్
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్(ఐవీపీఎల్) ప్రారంభ సీజన్ ఫైనల్‌లో ముంబై చాంపియన్స్, వీవీఐపీ ఉత్తరప్రదేశ్ జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి.
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్(ఐవీపీఎల్) ప్రారంభ సీజన్ ఫైనల్‌లో ముంబై చాంపియన్స్, వీవీఐపీ ఉత్తరప్రదేశ్ జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. నేడు టైటిల్ పోరు జరగనుంది. శనివారం జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో రెడ్ కార్పెట్ ఢిల్లీపై ముంబై, చత్తీస్‌గఢ్ వారియర్స్‌పై ఉత్తరప్రదేశ్ విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించాయి. తొలి సెమీస్‌లో రెడ్ కార్పెట్ ఢిల్లీపై ముంబై జట్టు 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 253 పరుగుల భారీ స్కోరు చేసింది. ఫిల్ మస్టర్డ్(73), నిర్వాన్ అత్రి(56), అభిషేక్(51 నాటౌట్) హాఫ్ సెంచరీ చేయగా.. రజత్ సింగ్(43 నాటౌట్) సైతం రాణించాడు. భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులే చేసింది. బిపుల్ శర్మ(61), యశ్‌పాల్ సింగ్(51) పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయారు.
మరో సెమీస్‌లో చత్తీస్‌గఢ్ వారియర్స్‌పై 19 పరుగుల తేడాతో ఉత్తరప్రదేశ్ గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ నిర్ణీత ఓవర్లలో 203/8 స్కోరు చేసింది. పవన్ నేగి(94) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. సురేశ్ రైనా(58) అర్ధ శతకంతో రాణించాడు. చత్తీస్‌గఢ్ బౌలర్లలో షాదాబ్ బషీర్ 4 వికెట్లతో మెరిశాడు. అనంతరం 204 పరుగుల లక్ష్య ఛేదనలో చత్తీస్‌గఢ్ నిర్ణీత ఓవర్లలో 184/2 స్కోరుకే పరిమితమైంది. జటిన్ సక్సేనా(76) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఓపెనర్ నమన్ ఓజా(43)తో కలిసి తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించాడు. ఆ తర్వాత జటిన్ సక్సేనా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అనంతరం అస్ఘర్ అఫ్గాన్(30 నాటౌట్), గురుకీరత్ సింగ్(17 నాటౌట్) పోరాటం చేసినా ఉత్తరప్రదేశ్ బౌలర్లు నిలువరించారు.