ఫైనల్‌లో శ్రీవల్లి ఓటమి
తెలుగమ్మాయి, టెన్నిస్ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మికకు తుది మెట్టుపై నిరాశ ఎదురైంది.
దిశ, స్పోర్ట్స్ : తెలుగమ్మాయి, టెన్నిస్ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మికకు తుది మెట్టుపై నిరాశ ఎదురైంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఐటీఎఫ్ ఉమెన్స్-35 ఇండోర్ ఓపెన్ టోర్నీలో డబుల్స్ టైటిల్ గెలిచిన ఆమె.. సింగిల్స్‌లో మాత్రం రన్నరప్‌గా సరిపెట్టింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో శ్రీవల్లి 3-6, 2-6 తేడాతో 2వ సీడ్, స్లోవేనియాకు చెందిన దలీలా జకుపోవిక్ చేతిలో పరాజయం పాలైంది. టోర్నీలో తొలి రౌండ్ నుంచి తనకంటే మెరుగైన ర్యాంక్‌లను మట్టికరిపిస్తూ శ్రీవల్లి అద్భుత ప్రదర్శన చేసింది. అయితే, ఫైనల్‌లో ఆ జోరును కొనసాగించలేకపోయింది. గంటా 7 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో పలు తప్పిదాలతో శ్రీవల్లి ప్రత్యర్థికి అవకాశాలు ఇచ్చింది. స్లోవేనియా క్రీడాకారిణి ఐదుసార్లు బ్రేక్ పాయింట్ సాధిస్తే.. శ్రీవల్లి ఒక్కసారి మాత్రమే బ్రేక్ పాయింట్ పొందింది. శనివారం ఈ టోర్నీలో వైదేహి చౌదరితో కలిసి శ్రీవల్లి డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.