ఐపీఎల్ వేలంలోకి 1,574 మంది క్రికెటర్లు.. ఈ నెల 24, 25 తేదీల్లో ఆక్షన్

వచ్చే ఐపీఎల్‌ సీజన్‌కు ముందు జరగబోయే మెగా వేలం తేదీలు, వేదిక ఖరారయ్యాయి.

Update: 2024-11-05 17:54 GMT

దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఐపీఎల్‌ సీజన్‌కు ముందు జరగబోయే మెగా వేలం తేదీలు, వేదిక ఖరారయ్యాయి. ఈ నెల 24, 25 తేదీల్లో ఆక్షన్ నిర్వహించనున్నట్టు బీసీసీఐ మంగళవారం వెల్లడించింది. రెండు రోజులపాటు జరిగే వేలానికి ఈ సారి సౌదీ అరేబియాలోని జెడ్డా వేదిక కానుంది. రియాద్‌లో జరగనున్నట్టు వార్తలు వచ్చినా.. బీసీసీఐ జెడ్డాకు మొగ్గు చూపింది. అలాగే, మెగా వేలంలో పాల్గొనడానికి ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ గడువు సోమవారంతో ముగిసింది. వేలంలో 1,574 మంది క్రికెటర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

204 బెర్త్‌లు

ప్రతి ఫ్రాంచైజీ 25 మంది ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఇటీవల రిటెన్షన్‌‌లో 10 ఫ్రాంచైజీలు 46 మందిని అంటిపెట్టుకున్నాయి. వేలంలో 204 స్థానాలు భర్తీ కానున్నాయి. వీటి కోసం 1,574 మంది ప్లేయర్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు. అందులో 1,165 మంది భారత ప్లేయర్లు ఉండగా.. 409 విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అందులో 320 క్యాప్డ్‌ప్లేయర్లు, 1,224 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, 30 మంది అసోసియేట్ దేశాల క్రికెటర్లు వేలంలో పాల్గొననున్నారు. వేలంలో ఫ్రాంచైజీలు దాదాపు రూ.641.5 కోట్లు ఖర్చు చేయనున్నాయి.

ఆ దేశం నుంచి అత్యధికంగా

వేలంలో 409 మంది విదేశీ క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. అత్యధికంగా సౌతాఫ్రికా నుంచి 91 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా నుంచి 76 మంది, ఇంగ్లాండ్ నుంచి 52 మంది, న్యూజిలాండ్ నుంచి 39 మంది, వెస్టిండీస్ నుంచి 33 మంది ప్లేయర్లు వేలంలోకి రానున్నారు. అఫ్గానిస్తాన్(29), శ్రీలంక(29), బంగ్లాదేశ్(13), నెదర్లాండ్స్(12), అమెరికా(10), ఐర్లాండ్(9), జింబాబ్వే(8), కెనడా(4), స్కాట్లాండ్(2) క్రికెటర్లు పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. అత్యల్పంగా ఇటలీ, యూఏఈ నుంచి ఒక్కరు చొప్పున మాత్రమే వేలంలో పాల్గొననున్నారు.

వేలంలోకి భారత స్టార్ క్రికెటర్లు

వేలంలో 48 మంది భారత క్యాప్డ్ ప్లేయర్లు బరిలో ఉండనున్నారు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వంటి స్టార్లు వేలంలోకి వచ్చారు. వారికి భారీ ధర పలికే అవకాశాలు ఉన్నాయి. వారితోపాటు రవిచంద్రన్ అశ్విన్, అవేశ్ ఖాన్, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా, నితీశ్ రాణా‌ వంటి ప్లేయర్లపై ఫ్రాంచైజీలు దృష్టిపెట్టాయి.  

Tags:    

Similar News