సూర్యకుమార్‌పై ఆ మూడు ఫ్రాంచైజీలు కన్ను.. కెప్టెన్సీ ఆఫర్‌

2025 సీజన్‌కు ముందు మెగా వేలంలో ఉండటంతో ఫ్రాంచైజీలు జట్లను బలోపేతం చేసుకోవడంపై ఫోకస్ పెట్టాయి.

Update: 2024-08-25 19:20 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ వచ్చే సీజన్‌కు అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. 2025 సీజన్‌కు ముందు మెగా వేలంలో ఉండటంతో ఫ్రాంచైజీలు జట్లను బలోపేతం చేసుకోవడంపై ఫోకస్ పెట్టాయి. అంతకుముందే కోచింగ్ స్టాఫ్‌‌‌లో మార్పులకు శ్రీకారం చుట్టాయి. అలాగే, వచ్చే సీజన్‌లో పలు జట్లకు కెప్టెన్లు కూడా మారే అవకాశం లేకపోలేదు. టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్‌ 2025 సీజన్‌లో ఏదో ఒక జట్టుకు సారథిగా వ్యవహరించే చాన్స్‌ ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలు అతనితో చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయా ఫ్రాంచైజీలు ‘మిస్టర్ 360’కి కెప్టెన్సీ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. సూర్య బ్యాటింగ్ నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పకనక్కర్లేదు. ఒంటిచెత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పే సమర్థుడు. నాయకత్వ లక్షణాల కూడా అతనిలో పుష్కలంగా ఉన్నాయి. ఇటీవలే అతని నాయకత్వంలో టీమ్ ఇండియా శ్రీలంక‌తో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్‌లో సూర్య ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు. అయితే, అతను ఆ జట్టు నుంచి బయటకు రావాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.

తొలి కప్పు కోసం

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ ఒక్కసారి కూడా చాంపియన్‌గా నిలవలేదు. తొలి టైటిల్ నిరీక్షణకు తెరదించాలన్న ఆ జట్ల కల అందని ద్రాక్షగానే ఉన్నది. ఆర్సీబీ మూడు సార్లు(2009, 2011, 2016) ఫైనల్‌కు చేరినా భంగపాటు తప్పలేదు. కోహ్లీ హయాంలో టైటిల్ కల నెరవేరలేదు. డుప్లెసిస్‌ నేతృత్వంలో ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌లో వెనుదిరిగింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ సమర్థవంతమైన నాయకుడి కోసం చూస్తున్నది. మరోవైపు, పంజాబ్ పరిస్థితి ఇంకా దారుణం. 2014లో ఫైనల్‌కు చేరుకోవడం మినహా ఆ జట్టు ప్రతి సీజన్‌లోనూ నిరాశపరుస్తున్నది. 2014 తర్వాత పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. కెప్టెన్లను మారుస్తున్నా పంజాబ్ టైటిల్ కల మాత్రం తీరడం లేదు. ఈ నేపథ్యంలో బెంగళూరు, పంజాబ్ జట్లు సూర్య వైపు మొగ్గుచూపుతున్నాయి. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా రాణిస్తున్న సూర్యకు పగ్గాలు అప్పగించాలని ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

శ్రేయస్‌‌ను ముంబైకి ఇచ్చి..

ఈ ఏడాది టైటిల్ గెలుచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా సూర్యకుమార్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫ్రాంచైజీ అతన్ని సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. వేలానికి కంటే ముందే ట్రేడింగ్ ద్వారా అతన్ని జట్టులోకి తీసుకోవాలని కేకేఆర్ భావిస్తున్నదట. అందుకు కోసం విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను కూడా వదులుకోవడానికి కోల్‌కతా సిద్ధమైనట్టు సమాచారం. ట్రేడింగ్ ద్వారా అయ్యర్‌ను ముంబైకి ఇచ్చి.. సూర్యను తీసుకోవాలని చర్చలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

సూర్య కెప్టెన్సీ రికార్డులు ఇవే

కెప్టెన్‌గా సూర్యకు మంచి రికార్డే ఉంది. అతని నాయకత్వంలో భారత్ ఆడిన 10 టీ20 మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌ల్లో నెగ్గింది. రెండింట మాత్రమే ఓడింది. ఆస్ట్రేలియాపై 4-1తో, శ్రీలంకపై 3-0తో టీమిండియాకు సిరీస్ విజయాలు అందించాడు. దేశవాళీలో ముంబైకి కెప్టెన్‌గా వ్యవహరించాడు. రంజీ ట్రోఫీలో ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం, మూడు డ్రాలు ఉన్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైకి 16 మ్యాచ్‌ల్లో 10 విజయాలు సాధించి పెట్టాడు. ఇక, ఐపీఎల్‌లో గతేడాది ముంబై ఇండియన్స్‌కు ఒక్క మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించగా ఆ మ్యాచ్‌లో జట్టు విజయం సాధించింది. 

Tags:    

Similar News