రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ అలా దక్కింది : సంజూ శాంసన్
టీమ్ ఇండియా యువ బ్యాటర్ సంజూ శాంసన్ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ బ్యాటర్ సంజూ శాంసన్ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 2021 నుంచి అతను రాజస్థాన్‌ను నడిపిస్తున్నాడు. తాజాగా రాజస్థాన్ పగ్గాలు ఎలా దక్కాయో శాంసన్ వివరించాడు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘2021 సీజన్‌కు ముందు ఇది జరిగింది. అప్పుడు మేము దుబాయ్‌లో ఆడుతున్నామనుకుంటా. మా లీడ్ ఓనర్ మనోజ్ బదాలే నా దగ్గరి వచ్చి కెప్టెన్సీ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నావా? అని అడిగారు. నేను సిద్ధమే అని చెప్పాను. చాలా సింపుల్‌గా జరిగింది. కెప్టెన్సీ చేపట్టడానికి తగినన్ని మ్యాచ్‌లు, ఫ్రాంచైజీతో తగినంత సమయం వెచ్చించానని నాకు అనిపించింది. కెప్టెన్‌గా రాణించగలననే నమ్మకం నాకుంది.’ అని శాంసన్ వివరించాడు.
తన బ్యాటింగ్ శైలి గురించి మాట్లాడుతూ.. జాతీయ జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ప్రత్యేకంగా ఏదైనా చేయాలని, అందుకే తాను ప్రత్యేకంగా ఉండేందుకు చూస్తానని చెప్పాడు. ‘నేను ఎప్పుడు బ్యాటింగ్‌లో నిలదొక్కుకోవాలనే చేస్తా. బ్యాటింగ్‌లో నా సొంత శైలిని సృష్టించాలనుకుంటా. మొదటి బంతి అయినా ముందుకు వెళ్లే సిక్స్ కొట్టాలనే చూస్తా. సిక్స్ కొట్టాలంటే 10 బంతులు ఎందుకు ఎదురుచూడాలి.’ అని శాంసన్ చెప్పుకొచ్చాడు.
కాగా, 2008 ప్రారంభ సీజన్‌లో చాంపియన్ నిలిచిన రాజస్థాన్ జట్టు ఆ తర్వాత మరోసారి టైటిల్ ముద్దాడలేకపోయింది. శాంసన్ నాయకత్వంలో 2022లో ఫైనల్‌కు చేరినా.. అక్కడ గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం పొందింది. గత సీజన్‌లో ఐదో స్థానంతో సరిపెట్టగా.. ఈ సారి సత్తాచాటాలని భావిస్తున్నది. ఈ నెల 24న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడటం ద్వారా రాజస్థాన్ ఈ సీజన్‌ను ప్రారంభించనుంది.