ఆ రూల్ నాకు బాగా నచ్చింది.. ఐపీఎల్‌లో కొత్త నిబంధనలపై రోహిత్ శర్మ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2023కి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ నెల 31న మెగా టోర్నీ ప్రారంభం కానున్నది. టోర్నీ దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ ప్రేక్షకులను అలరించనున్నది. అయితే, ఈ సారి ఐపీఎల్‌లో కొత్త నిబంధనలు అమలు చేయనున్నారు. ఈ సారి లీగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు బీసీసీఐ కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. కొత్తగా అమలు చేయనున్న నిబంధనలపై టీమ్ ఇండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ తన అభిప్రాయాలను వెల్లడించాడు.
ఈ సీజన్‌లో కొత్తగా అమలు చేయనున్న రూల్స్ తనకు బాగా నచ్చాయాని రోహిత్ అన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌తో పాటు టాస్ పడిన తర్వాత తుది జట్లను ప్రకటించడం బాగుందన్న రోహిత్.. ఈ నిబంధనలతో లీగ్ మరింత రసవత్తరంగా సాగనుందన్నాడు. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ఆల్ రౌండర్లకు ఆదరణ తగ్గుతుందని కొంతమంది మాజీ క్రికెటర్లు విమర్శిస్తుండగా.. ఈ రూల్‌తో భారత ఆటగాళ్లకు మేలు జరగనుందని మరికొందరు అంటున్నారు.