ఈ సారి నిరుడు లెక్కగాదు.. ఐపీఎల్-16లో కొత్త నిబంధనలు
ఐపీఎల్-16 సమయం దగ్గరపడింది. శుక్రవారం నుంచే టోర్నీ ప్రారంభకానుంది.
హైదరాబాద్: ఐపీఎల్-16 సమయం దగ్గరపడింది. శుక్రవారం నుంచే టోర్నీ ప్రారంభకానుంది. ఐపీఎల్ వచ్చిందంటే ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు పండగే. ధనాధన్ లీగ్ ఇచ్చే మజానే వేరు. అయితే, గత సీజన్లతో పోలిస్తే ఐపీఎల్ ఈ సారి క్రికెట్ ఫ్యాన్స్‌కు మరింత ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడం ఖాయం. అందుకు కారణం.. బీసీసీఐ ఈ సారి సరికొత్త రూల్స్‌ను తీసుకరావడమే. మరి, ఆ కొత్త నిబంధనలేంటో తెలుసుకుందాం..
ఇంపాక్ట్ ప్లేయర్..
ఐపీఎల్ కొత్తగా రానున్న రూల్స్‌లో ప్రధానమైనది ఇంపాక్ట్ ప్లేయర్. ఇప్పటికే ఈ రూల్‌పై చర్చ మొదలైంది. దీన్ని ఎలా అమలు చేస్తారు?.. ఈ రూల్ మ్యాచ్‌ను ఎలా మలుపు తిప్పుంది..? అని డిస్కస్ చేస్తున్నారు. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్, కంకషన్ సబ్‌స్టిట్యూట్ అంటే దాదాపు అందరికీ తెలుసు. ఇందులో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ మ్యాచ్‌లో కేవలం ఫీల్డింగ్‌కే పరిమితమవుతాడు. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌కు బ్యాటింగ్, బౌలింగ్ చేసే వీలుంటుంది. ఈ రెండూ కూడా తుది జట్టులోని ఏ ఆటగాడైనా గాయపడితే వారి స్థానాన్ని భర్తీ చేస్తాయి.
కానీ, ఇంపాక్ట్ ప్లేయర్ భిన్నమైంది. మ్యాచ్‌లో ఏ సందర్భాలోనైనా తుది జట్టులోని ఓ ఆటగాడి స్థానంలో మరో ప్లేయర్‌ను ఆడించొచ్చు. ఇది బ్యాటింగ్ చేసే జట్టుతోపాటు బౌలింగ్ చేసే జట్టుకూ వర్తిస్తుంది. ముందుగా తుది జట్టును ప్రకటించే ముందు నలుగురు సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్ల పేర్లను చేర్చాలి. ఆ నలుగురు ఆటగాళ్ల నుంచే ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇన్నింగ్స్ ఆరంభించే ముందుగానీ, ఓవర్ ముగిసిన తర్వాత, వికెట్ పడిన తర్వాత, ప్లేయర్ రిటైర్ అయిన తర్వాతగానీ ఇంపాక్ట్ ప్లేయర్‌ను తీసుకోవచ్చు. వికెట్ తీసిన తర్వాత బౌలింగ్ జట్టు కూడా ఇంపాక్ట్ ప్లేయర్‌ను పొందొచ్చు. కానీ ఓవర్ మధ్యలో వికెట్ పడితే.. ఆ ఓవర్లో మిగతా బంతులను ఇంపాక్ట్ ప్లేయర్ వేయడం కుదరదు.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చే ఆటగాడిన తన పూర్తి కోటా 4 ఓవర్లు వేసే వీలుంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌ను తీసుకునేముందు ఆ జట్టు కెప్టెన్ అంపైర్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. మైదానం వీడిన ఆటగాడు మళ్లీ మ్యాచ్‌లో భాగం కాలేడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా భారత ఆటగాడిని మాత్రమే ఆడించాలి. ఒక వేళ తుది జట్టులో నలుగురి కంటే తక్కువ మంది విదేశీ ఆటగాళ్లున్న సందర్భంలో మాత్రమే విదేశీ ప్లేయర్‌ను తీసుకోవచ్చు. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఇరు జట్లకు ఉపయోగపడనుంది. పరిస్థితులకు అనుగుణంగా బ్యాటర్‌నిగానీ, బౌలర్‌నిగానీ జట్టులోకి తీసుకోవచ్చు. ఈ నిబంధన ద్వారా మ్యాచ్‌ను మలుపు తిప్పే వీలు ఉండటంతో గేమ్ మరింత రసవత్తరంగా మారనుంది.
టాస్ తర్వాతే తుది జట్టు..
ఐపీఎల్ గత సీజన్లలో టాస్ వేసే ముందు ఇరు జట్ల కెప్టెన్లు తమ తుది జట్టును జాబితాను వెల్లడించేవారు. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఇలాగే ఉంది. కానీ, ఈ సారి ఇందులో మార్పు చేశారు. టాస్ ప్రభావాన్ని తగ్గించేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టాస్ వేసిన తర్వాత తుది జట్టును ప్రకటించే వీలు కల్పించింది. తద్వారా టాస్ గెలిచిన జట్టు, ఓడిన జట్టు పిచ్ పరిస్థితులను బట్టి తుది జట్టును ఎంపికే చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నిబంధన కూడా ఇరు జట్లకు ఉపయోగపడేదే. ముందుగా ఫీల్డింగ్ చేస్తే ఒకలా.. బ్యాటింగ్ చేయాల్సి వస్తే మరోలా జట్టు కూర్పును తమకు అనుకూలంగా ఉండేలా కెప్టెన్లు జాగ్రత్తలు తీసుకోవచ్చు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఈ నిబంధనను ప్రవేశపెట్టారు.
నో బాల్స్, వైడ్స్ రివ్యూ..
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వైడ్ బాల్‌కు రివ్యూ తీసుకుంది. బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ నో బాల్ రివ్యూ తీసుకుంది. అదేంటి వైడ్ బాల్, నో బాల్‌కు కూడా రివ్యూ తీసుకోవచ్చా? అని అందరూ ఆశ్చర్యపోయారు. బీసీసీఐ ఈ నియమాన్ని డబ్ల్యూపీఎల్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేసింది.
ఐపీఎల్-16లోనూ ఈ రూల్‌ను అమలు చేయనుంది. దాదాపుగా ప్లేయర్ అవుటా? కాదా? అనేది తేల్చడానికి రివ్యూ తీసుకుంటారనేది తెలిసిందే. అయితే, ఉత్కంఠగా సాగే మ్యాచ్‌ల్లో అంపైర్ తప్పుడు నిర్ణయాలు చాలా సందర్భాల్లో వివాదాలకు దారితీశాయి. ఇలాంటి వివాదాలకు చెక్ పెట్టేందుకు బీసీసీఐ నో బాల్, వైడ్ బాల్‌కు కూడా రివ్యూ తీసుకునే వీలు కల్పించింది.
ఐదుగురుకు బదులు నలుగురే..
నిర్ణీత సమయంలోగా బౌలింగ్ కోటా పూర్తియకపోతే ఇక నుంచి పెనాల్టీ విధించనున్నారు. 30 గజాల వెలుపల ఐదుగురు ఫీల్డర్లకు బదులుగా నాలుగురిని మాత్రమే ఉండనిస్తారు. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌నుంచి ఈ నిబంధన అమల్లో ఉంది. అలాగే, ఫీల్డర్లు ఎవరైనా అనుచితంగా కదిలితే.. ఫీల్డింగ్ చేసే జట్టుకు ఐదు పరుగులు జరిమానా విధించనున్నారు.
ఇతర గ్రూపులోని జట్లతో రెండేసి మ్యాచ్‌లు..
గత సీజన్ నుంచి లీగ్‌లో 10 జట్లు భాగమైన విషయం తెలిసిందే. ఐదేసి జట్ల చొప్పున రెండు గ్రూపుల విభజించారు. గతేడాది తమ గ్రూపులోని జట్టుతో రెండేసి మ్యాచ్‌లతోపాటు ఇంకో గ్రూపులో తమ స్థాయి కలిగిన జట్టుతో రెండు మ్యాచ్‌లు, ఇతర జట్లతో ఒకటి చొప్పున ఆడాయి. కానీ, ఈ సారి తమ గ్రూపులోని జట్లతో ఒక మ్యాచ్ మాత్రమే ఆడనున్నాయి. ఇతర గ్రూపులో ఐదు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడతాయి.