క్వార్టర్స్‌లో లక్ష్యసేన్ ఓటమి

ఇండోనేషియా ఓపెన్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది.

Update: 2024-06-07 12:31 GMT

దిశ, స్పోర్ట్స్ : జకార్తాలో జరుగుతున్న ఇండోనేషియా ఓపెన్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది. టోర్నీలో మిగిలిన ఏకైక భారత ఆటగాడు లక్ష్యసేన్ క్వార్టర్స్‌ను దాటలేకపోయాడు. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ 22-24, 18-21 తేడాతో వరల్డ్ నం.5 అండర్స్ ఆంటోన్సెన్(డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. గంటకుపైగా రసవత్తరంగా సాగిన పోరులో లక్ష్యసేన్ చివరి వరకూ పోరాటం చేశాడు. కీలక సమయాల్లో అతను చేసిన తప్పిదాలకు మూల్యం చెల్లించుకున్నాడు.

నువ్వానేనా అన్నట్టు సాగిన తొలి గేమ్‌లో ఇద్దరు పాయింట్ల కోసం పోటీపడ్డారు. ఒక దశలో 20-18తో గేమ్ నెగ్గడానికి పాయింట్ దూరంలో ఆగిన లక్ష్యసేన్ అక్కడ బోల్తా పడ్డాడు. ఇక, రెండో గేమ్‌ ఆరంభంలో దూకుడుగా ఆడిన అతను 7-2 ఆధిక్యంలో నిలిచాడు. అయితే, ఆధిక్యాన్ని చివరి వరకూ కొనసాగించడంలో విఫలమై గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ కోల్పోయాడు. ఈ టోర్నీలో లక్ష్యసేన్‌కు ఇదే ఉత్తమ ప్రదర్శన. ఇప్పటికే సింగిల్స్‌లో పీవీ సింధు, హెచ్‌ఎస్ ప్రణయ్‌తోపాటు డబుల్స్‌లో గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ, అశ్విని-తనీషా జోడీలు ఇంటిదారిపట్టిన విషయం తెలిసిందే. 


Similar News