టీమ్ ఇండియా శ్రీలంక టూరు షెడ్యూల్ ఖరారు

ఈ నెల చివర్లో టీమ్ ఇండియా టీ20, వన్డే సిరీస్‌ల కోసం శ్రీలంకలో పర్యటించనుంది.

Update: 2024-07-11 15:09 GMT

దిశ, స్పోర్ట్స్ : ఈ నెల చివర్లో టీమ్ ఇండియా టీ20, వన్డే సిరీస్‌ల కోసం శ్రీలంకలో పర్యటించనుంది. ఈ టూరుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. బీసీసీఐ గురువారం షెడ్యూల్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ నెల 26 నుంచి ఆగస్టు 7 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదట టీ20 సిరీస్‌తో టూరు ప్రారంభమవుతుంది. ఈ నెల 26న తొలి టీ20 జరగనుండగా.. 27వ, 29వ తేదీల్లో మిగతా రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మూడు మ్యాచ్‌లకు పల్లెకెల ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.

అలాగే, కొలంబోలోని ఆర్‌ ప్రేమదాస్ అంతర్జాతీయ స్టేడియం వన్డే మ్యాచ్‌లకు వేదిక కానుంది. ఆగస్టు 1వ, 4వ, 7వ తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ వన్డే సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రాలకు విశ్రాంతినివ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యా, వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్‌ను కెప్టెన్లుగా నియమించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సిరీస్‌తో టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. 2021లో భారత జట్టు చివరిసారిగా శ్రీలంకలో పర్యటించింది. అప్పుడు భారత్ వన్డే సిరీస్‌ను 2-1తో దక్కించుకోగా.. టీ20 సిరీస్‌ను శ్రీలంక నెగ్గింది.


Similar News