అందుకే వాళ్లను తీసుకోలేదు : అజిత్ అగార్కర్, రోహిత్

Update: 2024-05-02 16:07 GMT

దిశ, స్పోర్ట్స్ : త్వరలోనే జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును ఇటీవల బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో గురువారం నిర్వహించిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు ఎంపికతోపాటు పలు విషయాలు గురించి మాట్లాడారు. శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్‌లను రిజర్వ్ ప్లేయర్లుగా మాత్రమే పరిగణలోకి తీసుకోవడం, కేఎల్ రాహుల్‌ను పూర్తిగా పక్కనపెట్టడంపై అజిత్ అగార్కర్ క్లారిటీ ఇచ్చాడు. ఆటగాళ్ల తప్పు లేదని చెప్పాడు. ‘మేము కోరుకున్న కాంబినేషన్ వల్లే వాళ్లకు అవకాశం దక్కలేదు. మణికట్టు స్పిన్నర్లను కావాలనుకున్నాం. అందుకే, చాహల్, కుల్దీప్‌కు చోటు కల్పించాం. కేఎల్ రాహుల్ అద్భుతమైన ప్లేయర్. ఐపీఎల్‌లో అతను ఓపెనర్‌‌గా వస్తున్నాడు. మేము మిడిలార్డర్‌పై ఫోకస్ పెట్టాం. పంత్, శాంసన్ సరిపోతారని భావించాం. శాంసన్ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు.’ అని చెప్పాడు. అలాగే, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు చోటుపై స్పందిస్తూ.. అతన్ని స్థానాన్ని భర్తీ చేయడం కష్టంతో కూడుకున్నదని, పాండ్యా కెప్టెన్‌కు చాలా విషయాల్లో ఉపయోగపడతాడని చెప్పాడు. విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై వస్తున్న విమర్శలపై అజిత్ మాట్లాడుతూ..‘దాని గురించి మేము చర్చించలేదు. అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఎలాంటి ఆందోళన లేదు. ప్రపంచకప్‌లో అనుభవం చాలా ముఖ్యం. వరల్డ్ కప్ ఒత్తిడి భిన్నంగా ఉంటుంది.’ అని తెలిపాడు.

నలుగురు స్పిన్నర్లపై అప్పుడే క్లారిటీ ఇస్తా : రోహిత్

జట్టులో నలుగురు స్పిన్నర్లను ఎందుకు తీసుకున్నామో వరల్డ్ కప్ సమయంలోనే చెబుతానని కెప్టెన్ రోహిత్ తెలిపాడు. ‘నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడంలో సాంకేతిక అంశం ఉంది. అది ఏంటో వరల్డ్ కప్‌లో చెబుతా. ముగ్గురు పేసర్లు, హార్దిక్ నాలుగో ఆప్షన్. కుల్దీప్, చాహల్‌తోపాటు అక్షర్, జడేజా ఉన్నారు. వారిద్దరూ బ్యాటుతోనూ సత్తాచాటుతారు. ప్రత్యర్థిని బట్టి కాంబినేషన్ సెట్ చేస్తాం.’ అని రోహిత్ చెప్పాడు. మిడిలార్డర్‌లో నిర్భయంగా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలడనే ఉద్దేశంతోనే శివమ్ దూబెకు చోటు కల్పించామన్నాడు. గతేడాది టీ20 మ్యాచ్‌లు ఆడకపోవడంపై రోహిత్ స్పందిస్తూ..‘వన్డే వరల్డ్ కప్‌పై దృష్టి పెట్టడం వల్లే టీ20 ఫార్మాట్‌కు దూరమయ్యాం. ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరిగినప్పుడు మేము వన్డేలు ఆడలేదు.’ అని తెలిపాడు. టీ20ల్లో తిరిగి కెప్టెన్‌గా రావడంపై మాట్లాడుతూ..‘నేను కెప్టెన్‌ని. మళ్లీ కెప్టెన్ అవ్వలేదు.’ అని సమాధానమిచ్చాడు. 

Tags:    

Similar News