టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఎంపిక అప్పుడే
ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్ సందడి మొదలుకానుంది.
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్ సందడి మొదలుకానుంది. జూన్ 2 నుంచి ప్రారంభకానున్న ఈ పొట్టి ప్రపంచకప్‌కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌కు బీసీసీఐ ఇంకా భారత జట్టును ప్రకటించలేదు. ఐపీఎల్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి జట్టు ఎంపిక ఉండే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
ఏప్రిల్ చివరి వారంలో భారత జట్టును ఎంపిక చేయనున్నట్టు బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘ఏప్రిల్ చివరి వారంలో భారత జట్టును ఎంపిక చేస్తారు. అప్పటికి ఐపీఎల్ తొలి దశ ముగుస్తుంది. ఆటగాళ్ల ఫామ్, ఫిట్‌నెస్‌ను అంచనా వేయడానికి సెలెక్టర్లకు వీలు ఉంటుంది.’ అని పేర్కొన్నారు.
అలాగే, ఐపీఎల్ లీగ్ స్టేజ్ ముగిసిన తర్వాత తొలి బ్యాచ్ ఆటగాళ్లు న్యూయార్క్ బయలుదేరుతారని చెప్పారు. ‘మే 19న ఐపీఎల్ లీగ్ స్టేజ్ ముగియనుంది. ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించని జట్లలోని ఆటగాళ్లు ముందే న్యూయార్క్‌కు వెళ్తారు.’ అని తెలిపారు. కాగా, ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించేందుకు ఐసీసీ విధించిన డెడ్‌లైన్ మే 1. అయితే, ఐసీసీ అనుమతితో మే 25 వరకు జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉంది.