సుమిత్ నగాల్ ఆట ముగిసింది.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఎంత ప్రైజ్‌మనీ దక్కిందంటే?

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత స్టార్ టెన్నిస్ ఆటగాడు సుమిత్ నగాల్ పోరాటం ముగిసింది.

Update: 2024-01-18 13:39 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత స్టార్ టెన్నిస్ ఆటగాడు సుమిత్ నగాల్ పోరాటం ముగిసింది. తొలి రౌండ్‌లో వరల్డ్ నం.27‌ను మట్టికరిపించి సంచలనం సృష్టించిన సుమిత్.. రెండో రౌండ్‌లో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్ర్కమించాడు. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో సుమిత్‌ను 6-2, 3-6, 5-7, 4-6 తేడాతో చైనా ప్లేయర్ జున్‌చెంగ్ షాంగ్ ఓడించాడు. 2 గంటల 50 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో మొదట శుభారంభం చేసింది సుమితే. విన్నర్లతో విరుచుకపడిన అతను రెండుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేసి సునాయసంగా తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. అనంతరం చైనా షట్లర్ బలంగా పుంజుకున్నాడు. సుమిత్ సైతం పోరాడినప్పటికీ పలు తప్పిదాలతో వరుసగా మూడు సెట్లను కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. దీంతో సుమిత్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్‌లోనే ఇంటిదారిపట్టాడు. రెండో రౌండ్‌కు చేరుకోవడం ద్వారా సుమిత్ దాదాపు రూ. కోటిన్నర ప్రైజ్‌మనీని అందుకున్నాడు. 2021 ఎడిషన్‌లోనూ పాల్గొన్న అతను తొలి రౌండ్‌లో ఓడిపోయాడు. కాగా, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మెన్స్ సింగిల్స్ కేటగిరీలో ఓ భారత ఆటగాడు ఇప్పటివరకు మూడో రౌండ్‌‌ను దాటలేదు. రమేశ్ కృష్ణన్ మాత్రమే మూడో రౌండ్‌కు చేరిన ఏకైక భారత ఆటగడు. తన కెరీర్‌లో అతను ఐదు సార్లు (1983, 84, 87, 88, 89) మూడో రౌండ్‌ వరకు వెళ్లాడు. లియాండర్‌ పేస్‌, విజయ్‌ అమృత్‌రాజ్ రెండో రౌండ్‌లోనే వెనుదిరిగారు.

Tags:    

Similar News