ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు ఎంపిక.. వారికి మళ్లీ నిరాశే

ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో తలపడే భారత జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది.

Update: 2024-01-12 18:10 GMT

దిశ, స్పోర్ట్స్ : ఈ నెల చివర్లో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు భారత్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రోహిత్ సేన సొంతగడ్డపై ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్ ఆడుతున్నది. ఈ సిరీస్ ముగియగానే ఇంగ్లాండ్‌తో టెస్టు పోరుకు సిద్ధం కానుంది. తాజాగా ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో తలపడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ సేన సారథ్యంలో 16 మందితో కూడిన బలమైన జట్టును శుక్రవారం ఎంపిక చేసింది. స్టార్ పేసర్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తొలిసారిగా జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకున్నాడు. దేశవాళీలో సత్తాచాటడంతో అతన్ని ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు. 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 46.47 సగటుతో 790 పరుగులు చేశాడు. ఇందులో డబుల్ సెంచరీ కూడా ఉంది. అయితే, మెయిన్ వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ ఎంపిక చేయగా.. తెలుగు కుర్రాడు కేఎస్ భరత్‌తోపాటు ధ్రువ్ జురెల్‌ను బ్యాకప్ వికెట్ కీపర్లుగా సెలెక్టర్లు చేశారు. మరో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ సెలెక్షన్‌కు అందుబాటులో లేడని తెలుస్తోంది. రుతురాజ్ గైక్వాడ్, మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్నారు. మిగతా టెస్టులకు షమీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, సీనియర్ టెస్టు ప్లేయర్లు చతేశ్వర్ పుజారా, రహానేలకు మరోసారి నిరాశే ఎదురైంది. రంజీ ట్రోఫీలో ఇటీవల పుజారా డబుల్ సెంచరీతో మెరిసినా అతన్ని సెలెక్టర్లు అతన్ని పరిగణలోకి తీసుకోలేదు. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో నిరాశపర్చిన శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ టెస్టు జట్టులో చోటు కోల్పోయారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తిరిగి టెస్టు జట్టులోకి వచ్చారు. పేస్ దళాన్ని బుమ్రా, సిరాజ్ నడిపించనుండగా.. ముకేశ్ కుమార్ చోటు పదిలం చేసుకున్నాడు. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో బెంచ్‌కే పరిమితమైన అవేశ్ ఖాన్‌కు కూడా చోటు దక్కింది. ఇంగ్లాండ్‌పై అతను టెస్టు అరంగేట్రం చేస్తాడో?లేడో? చూడాలి. కాగా, ఈ నెల 25 నుంచి 29 మధ్య తొలి టెస్టుకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.

భారత జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, అవేశ్ ఖాన్.  

Tags:    

Similar News