చైనా చేతిలో భారత్ ఓటమి
ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్‌లో అమెరికాపై గెలిచి వరుస పరాజయాలకు బ్రేక్ వేసిన భారత మహిళల జట్టు మళ్లీ ఓటమిని చవిచూసింది.
దిశ, స్పోర్ట్స్ : ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్‌లో అమెరికాపై గెలిచి వరుస పరాజయాలకు బ్రేక్ వేసిన భారత మహిళల జట్టు మళ్లీ ఓటమిని చవిచూసింది. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చైనా చేతిలో 2-1 తేడాతో పరాజయం పాలైంది. గు బింగ్‌ఫెంగ్ రెండు గోల్స్ చేసి చైనా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో శుభారంభం భారత్‌దే. 7వ నిమిషంలో సంగీత కుమారి ఫీల్డ్ గోల్ చేసి జట్టు ఖాతా తెరిచింది. ఆ తర్వాత 14 నిమిషంలో గు బింగ్‌ఫెంగ్ గోల్ చేయడంతో చైనా స్కోరును 1-1తో సమం చేసింది. అనంతరం ఇరు జట్లు ప్లేయర్లు చక్కటి డిఫెన్స్ ప్రదర్శించారు. దీంతో రెండు, మూడు క్వార్టర్లలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఇక, 53వ నిమిషంలో గు బింగ్‌ఫెంగ్ మరో గోల్ చేయడంతో చైనా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సమయంలో భారత్ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయింది. 55వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మల్చలేకపోయి మ్యాచ్‌ను సమర్పించుకుంది. ఈ నెల 14న జరిగే తర్వాతి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత జట్టు తలపడనుంది.