ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు భారత మహిళల హాకీ జట్టు ఎంపిక
పారిస్ ఒలింపిక్స్ అర్హత టోర్నీ ఎఫ్‌ఐహెచ్ హాకీ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ అర్హత టోర్నీ ఎఫ్‌ఐహెచ్ హాకీ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. రాంచీ వేదికగా జనవరి 13 నుంచి 19 వరకు టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టును హాకీ ఇండియా శనివారం ప్రకటించింది. గోల్ కీపర్ సవిత సారథ్యంలో 18 మందితో కూడిన జట్టును వెల్లడించింది.
సీనియర్ ఫార్వార్డ్ వందన కటారియా వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది. ‘పారిస్ ఒలింపిక్స్ ప్రయాణంలో ఎఫ్‌ఐహెచ్ హాకీ ఒలింపిక్ క్వాలిఫయర్స్ మాకు ముఖ్యమైన టోర్నీ. కాబట్టి, నైపుణ్యం, అనుభవంతో కూడిన సమతూకమైన జట్టును ఎంపిక చేశాం. సవిత, వందన అనేక మ్యాచ్‌ల్లో అధిక ఒత్తిడి పరిస్థితులను ఎదుర్కొన్నారు. వారు జట్టుకు సరైన మార్గనిర్దేశం చేసేందుకు సన్నద్ధమయ్యారు.’ అని మహిళల హాకీ జట్టు చీఫ్ కోచ్ జన్నకే షాప్‌మన్ తెలిపాడు.
ఈ టోర్నీలో టాప్-3 స్థానాల్లో నిలిచిన జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా టీమ్ ఇండియా రంగంలోకి దిగనుంది. టోర్నీలో న్యూజిలాండ్, ఇటలీ, అమెరికాలతో కలిసి భారత జట్టు పూల్-బిలో ఉన్నది. జనవరి 13న అమెరికాతో మ్యాచ్‌తో భారత్ టోర్నీ మొదలుపెట్టనుండగా.. 15న న్యూజిలాండ్‌తో, 16న ఇటలీతో తలపడనుంది.
భారత జట్టు : గోల్‌కీపర్స్ : సవిత(కెప్టెన్), బిచు దేవి, డిఫెండర్స్ : నిక్కి ప్రధాన్, ఉదిత, ఇషికా చౌదరి, మోనిక, మిడ్ ఫీల్డర్స్ : నిశా, వైష్ణవి, నేహా, నవ్‌నీత్ కౌర్, సలీమా, సోనిక, జ్యోతి, బ్యూటీ డంగ్‌డంగ్, ఫార్వార్డ్స్: లాల్రేమ్సియామి, సంగీత కుమారి, దీపిక, వందన కటారియా.
Read More..