Asian Games: మహిళా షట్లర్ల ఫ్లాప్ షో.. నిరాశపరిచిన పీవీ సింధు
ఆసియా క్రీడల్లో భారత మహిళల బ్యాడ్మింట్ జట్టు నిరాశపరిచింది.
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా క్రీడల్లో భారత మహిళల బ్యాడ్మింట్ జట్టు నిరాశపరిచింది. పీవీ సింధు నేతృత్వంలో బృందం పేలవ ప్రదర్శన కనబరిచింది. క్వార్టర్ ఫైనల్లో థాయిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు దారుణంగా ఓడిపోయింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా 0-3 తేడాతో థాయిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. బలమైన థాయ్ జట్టు ముందు ఇండియా మహిళా షట్లర్లు నిలవలేకపోయారు. థాయ్ జట్టులో మాజీ వరల్డ్ చాంపియన్ రచనోక్ ఇంటనన్, వరల్డ్ నెంబర్ 12 ప్లేయర్ పోర్న్‌పావి చోచువాంగ్, వరల్డ్ నెంబర్ 17 సుపనిదా కటేతాంగ్‌లు ఉన్నారు.
ఆసియా క్రీడల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్లు కనీస పోరాటాన్ని కూడా ప్రదర్శించలేకపోయారు. రెండు సార్లు ఒలింపిక్ మెడల్ గెలిచిన పీవీ సింధు.. మహిళ సింగిల్స్ మ్యాచ్‌లో 21-14, 15-21, 14-21 స్కోరుతో చోచువాంగ్ చేతిలో ఓడిపోయింది. ట్రెస్సా జోలీ, గాయత్రి గోపిచంద్‌కు చెందిన భారత జోడి.. 19-21, 5-21 స్కోరుతో మహిళల డబుల్స్ ఈవెంట్‌లో పరాజయం పాలయ్యారు. ఇక ఎడమ చేతి షట్లర్ అస్మితా చాలిహ 9-21, 16-21 స్కోరుతో బుసానన్ ఒంగ్బామ్‌రుంగ్‌పాన్ చేతిలో ఓటమిపాలైంది.