సంచలన వివాదంలో టీమిండియా చీఫ్ సెలక్టర్.. భారత క్రికెట్‌లో ప్రకంపనలు!
భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ సంచలన వివాదంలో చిక్కుకున్నారు. ఓ ప్రముఖ మీడియా చానల్
దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ సంచలన వివాదంలో చిక్కుకున్నారు. ఓ ప్రముఖ మీడియా చానల్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో భారత క్రికెట్ జట్టులో జరుగుతున్న విషయాల గురించి కీలక విషయాల్ని చెప్పేశారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మధ్య చెలరేగిన వివాదం, భారత ఆటగాళ్లు మ్యాచ్‌కు ముందు ఫిట్‌నెస్ కోసం ఇంజెక్షన్స్ తీసుకుంటున్నట్లు కూడా కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. 'క్రికెటర్లు పూర్తి స్థాయిలో ఫిట్‌గా లేకపోతే.. మ్యాచ్‌కు ముందు ఇంజెక్షన్ తీసుకుని కనీసం 80శాతం ఫిట్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. ప్రస్తుతం బౌలర్ బుమ్రా కనీసం కిందకు వంగలేని పరిస్థితులో ఉన్నాడని.. మరో ఇద్దరు క్రికెటర్లు కూడా ప్రైవేట్‌గా ఇంజెక్షన్లు తీసుకుని ఫిట్‌నెస్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని సంచలన విషయాలు చెప్పారు.
అది పెయిన్ కిల్లర్ కాదని, ఒకవేళ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ తీసుకుంటే డోపింగ్ టెస్టులో దొరికిపోతారు' అని చేతన్ శర్మ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. విరాట్-గంగూలీ వివాదంపై స్పందిస్తూ.. 'ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సౌరవ్ గంగూలీ అనుకూలం ఏమీ కాదు.. కానీ కోహ్లీ అంటే మాత్రం అతనికి నచ్చదు. రోహిత్ శర్మ ఇకపై టీ20 జట్టులో ఎక్కువ కాలం కొనసాగడు. అతనితో పాటు విరాట్ కోహ్లి కూడా కష్టమే. హార్దిక్ పాండ్యకి కెప్టెన్సీ ఇచ్చి.. శుభమన్ గిల్‌కి అవకాశాలిస్తాం' అని చేతన్ శర్మ వెల్లడించాడు. భారత్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇప్పుడు చేతన శర్మ మాటలు భారత క్రికెట్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి.