టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కు షాక్.. ఆ టోర్నీలో అన్‌సోల్డ్

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు షాక్ తగిలింది.

Update: 2024-09-01 13:43 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా మహిళల టీ20 లీగ్ బిగ్‌బాష్ లీగ్(డబ్ల్యూబీబీఎల్) వచ్చే సీజన్‌ కోసం ఆదివారం జరిగిన డ్రాఫ్ట్‌లో ఆమె అన్‌సోల్డ్‌గా మిగిలిపోయింది. డబ్ల్యూబీబీఎల్‌‌లో ఆల్‌రౌండర్‌గా మంచి రికార్డు ఉన్న హర్మన్‌‌పై ఫ్రాంచైజీలు ఆసక్తిచూపించకపోవడం గమనార్హం. గతంలో డబ్ల్యూబీబీఎల్‌లో హర్మన్ ఐదు సీజన్లు ఆడింది.

సిడ్నీ థండర్స్, మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌కు ఆడిన ఆమె మొత్తం 58 ఇన్నింగ్స్‌ల్లో 1,440 పరుగులు చేసింది. 2021లో మెల్‌బోర్న్ రెనెగెడ్స్ తరపున 399 పరుగులతోపాటు 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచింది. గతేడాది టోర్నీలో పాల్గొన్న ఏకైక భారత క్రికెటర్ ఆమెనే కావడం విశేషం. డబ్ల్యూబీబీఎల్‌‌‌ లీగ్‌లోనే కాకుండా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లోనే ఘనమైన రికార్డు ఉన్న హర్మన్‌ అన్‌సోల్డ్‌గా మిగలడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.హర్మన్‌తోపాటు శ్రేయాంక పాటిల్, స్పిన్నర్ రాధా యాదవ్‌లపై కూడా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు.

వచ్చే సీజన్ కోసం డ్రాఫ్ట్‌లో భారత్ నుంచి 19 క్రీడాకారిణులు పేరు నమోదు చేసుకోగా.. ఆరుగురిని మాత్రమే ఫ్రాంచైజీలు తీసుకున్నాయి. డ్రాఫ్ట్ కంటే ముందే స్టార్ బ్యాటర్ స్మృతి మంధానతో అడిలైడ్ స్ట్రైకర్స్ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక, డ్రాఫ్ట్‌లోకి వచ్చిన హేమలతను పెర్త్ స్కార్చర్స్, యాస్తికా భాటియా, దీప్తి శర్మలను మెల్‌బోర్న్ స్టార్స్ తీసుకుంది. శిఖా పాండే, జెమీమా రోడ్రిగ్స్‌లను బ్రిస్బేన్ హీట్ దక్కించుకుంది. మహిళల బిగ్‌బాష్ లీగ్ ఈ ఏడాది అక్టోబర్ 27 నుంచి ప్రారంభంకానుంది.

Tags:    

Similar News