Asia cup 2024 : ఆసియా కప్ యువభారత్‌దే.. హాకీ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై ఘన విజయం
భారత పురుషుల జూనియర్ హాకీ జట్టు అదరగొట్టింది.
దిశ, స్పోర్ట్స్ : భారత పురుషుల జూనియర్ హాకీ జట్టు అదరగొట్టింది. ఆసియా కప్ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. మస్కట్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 5-3 తేడాతో విజయం సాధించి హ్యాట్రిక్ టైటిల్స్‌ను తమ ఖాతాలో వేసుకుంది. 2004, 2008, 2015, 2023లో భారత జట్టు టైటిల్ కైవసం చేసుకుంది. తాజా విజయంతో ఐదు సార్లు టైటిల్ సొంతం చేసుకున్నట్లయింది. అరైజీత్ సింగ్ హందాల్ ఈ మ్యాచ్‌లో 4 గోల్స్ కొట్టి హీరోగా నిలిచాడు. అరైజీత్ మూడు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచాడు.18, 47, 56 నిమిషాల్లో గోల్స్ చేశాడు. దిల్ రాజ్ సింగ్ ఆట 19వ నిమిషంలో భారత్‌కు మరో గోల్ అందించాడు. పాకిస్తాన్ జట్టులో సుఫ్యాన్ ఖాన్ ఆట 30, 39వ నిమిషంలో రెండు, హమ్నాన్ షాహిద్ మూడో నిమిషంలో ఒక గోల్ కొట్టారు. మ్యాచ్‌లో తొలుత పాకిస్తాన్ గోల్ కొట్టి లీడ్‌లోకి వచ్చింది. అనంతరం పుంజుకున్న భారత జట్టు నిమిషం వ్యవధిలో గోల్ కొట్టి స్కోర్‌ను సమం చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ 3-1తో లీడ్‌లోకి రాగా పాకిస్తాన్ జట్టు సైతం భారత జట్టుకు గట్టి పోటినిచ్చింది. స్కోరును 3-3తో సమం చేసింది. అయితే నాలుగవ క్వార్టర్‌లో అరైజీత్ సింగ్ వరుసగా రెండు గోల్స్ కొట్టడంతో భారత్ టైటిల్ విజేతగా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ ఫైనల్ పోరులో పాకిస్తాన్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. గ్రూప్ దశను అజేయంగా ముగించిన భారత జట్టు సెమీస్‌లో మలేషియాపై 3-1తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.