Boxing: భారత మహిళా బాక్సర్లకు బిగ్ షాక్.. బాక్సింగ్ హెడ్ కోచ్‌ రాజీనామా

ఆసియా గేమ్స్‌కు ముందు భారత మహిళా బాక్సర్లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

Update: 2023-06-26 14:32 GMT

న్యూఢిల్లీ : ఆసియా గేమ్స్‌కు ముందు భారత మహిళా బాక్సర్లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉమెన్స్ బాక్సింగ్ టీమ్ హెడ్ కోచ్ భాస్కర్ భట్ తన పదవి నుంచి తప్పుకున్నాడు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) హై పర్ఫామెన్స్ డైరెక్టర్‌(హెచ్‌పీడీ)గా నియామకవడంతో హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. చైనాలో జరగబోయే ఆసియా గేమ్స్‌కు స్టార్ బాక్సర్లు నిఖత్ జరీన్, లవ్లీనా బోర్గోహైన్ మాత్రం అర్హత సాధించారు. ఆసియా గేమ్స్‌కు దాదాపు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉన్నది.

ఈ నేపథ్యంలో నిఖత్, లవ్లీనాలకు టోర్నీకి ముందు సరైన మార్గదర్శకత్వం లేకపోవడం ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. తన కొత్త రోల్‌పై భాస్కర్ భట్ స్పందిస్తూ.. ‘సాయ్ హెచ్‌పీడీ చాలా బాధ్యతలతో కూడుకున్నది. మహిళా బాక్సర్లకు మార్గనిర్దేశం చేసేందుకు హై పర్ఫామెన్స్ డైరెక్టర్ బెర్నార్డ్ డున్నె, విదేశీ కోచ్ డిమిత్రి డిమిత్రుక్ ఉన్నారు. ఇప్పుడు నా కొత్త బాధ్యతలపై దృష్టి పెట్టాలనుకుంటున్నా.’ అని తెలిపారు.

2021 నవంబర్‌లో ఉమెన్స్ బాక్సింగ్ టీమ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టగా.. భాస్కర్ భట్ శిక్షణలో మహిళా బాక్సర్లు అంతర్జాతీయ వేదికపై సత్తాచాటారు. గతేడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ గెలుచుకోగా.. మరో ఇద్దరు బాక్సర్లు కాంస్య పతకాలు సాధించారు. అలాగే, ఈ ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లో డున్నె, డిమ్రితిక్‌తో పనిచేశాడు. నిఖత్ జరీన్‌తోపాటు నీతూ, లవ్లీనా బోర్గోహైన్, సావిటీ బూర తమ విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలుచుకున్న విషయం తెలిసిందే.


Similar News