భారత్ జోరు.. సౌత్ కొరియాకు షాక్
ఏషియన్ హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల హాకీ జట్టు జోరు కొనసాగుతోంది.
దిశ, స్పోర్ట్స్ : ఏషియన్ హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల హాకీ జట్టు జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో మలేషియాను ఓడించిన భారత్.. మంగళవారం జరిగిన రెండో గ్రూపు మ్యాచ్‌లో బలమైన సౌత్ కొరియాను చిత్తు చేసింది. చివరి వరకు రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో 3-2 తేడాతో విజయం సాధించింది. దీపిక రెండు గోల్స్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆరంభంలో టీమిండియాదే ఆధిపత్యం. సంగీత తన ఫామ్‌ను కొనసాగిస్తూ 3వ నిమిషంలోనే జట్టుకు తొలి గోల్ అందించింది. ఆ తర్వాత 20వ నిమిషంలో దీపిక చేసిన గోల్‌తో భారత్ ఫస్టాఫ్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచి పట్టు సాధించింది. అయితే, మూడో క్వార్టర్‌లో సౌత్ కొరియా బలంగా పుంజుకుంది. 34వ నిమిషంలో యురీ లీ, 28వ నిమిషంలో కెప్టెన్ యున్‌బి చియెన్ గోల్స్ చేయడంతో ప్రత్యర్థి 2-2తో స్కోరును సమం చేసింది. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ ఆసక్తికరంగా మారిపోయింది. అనంతరం ఇరు జట్లు ఆధిక్యం కోసం పోటీపడ్డాయి. మరో మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా దీపిక 57వ నిమిషంలో గోల్ చేసి భారత్‌ను విజయతీరాలకు చేర్చింది. నేడు మూడో గ్రూపు మ్యాచ్‌లో భారత్.. థాయిలాండ్‌తో తలపడనుంది.