IND VS SA : శతక్కొట్టిన శాంసన్.. రెచ్చిపోయిన స్పిన్నర్లు.. తొలి టీ20 భారత్‌దే
సౌతాఫ్రికా పర్యటనను టీమిండియా విజయంతో మొదలుపెట్టింది. తొలి టీ20లో భారీ విజయం సాధించింది.
దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా పర్యటనలో భారత కుర్రాళ్లు శుభారంభం చేశారు. సంజూ శాంసన్ శతక్కొట్టడం, స్పిన్నర్లు తిప్పేయడంతో తొలి టీ20ని టీమిండియా ఏకపక్షంగా నెగ్గింది. శుక్రవారం డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను మట్టికరిపించింది. దీంతో నాలుగు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 202 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ శాంసన్(107) మెరుపు శతకం బాదాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(33) పర్వాలేదనిపించాడు. అనంతరం ఛేదనకు దిగిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు కట్టడి చేశారు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి(3/25), రవి బిష్ణోయ్(3/28) స్పిన్ ఉచ్చులో ఇరుక్కున్న సఫారీ జట్టు ఏ దశలోనూ కోలుకోలేదు. 17.5 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా 141 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ఏ ఒక్కరూ క్రీజులో నిలువలేకపోయారు. క్లాసెన్(25) టాప్ స్కోరర్.
శాంసన్ ఆకాశమే హద్దుగా..
భారత్ 202 పరుగుల భారీ స్కోరు చేసిందంటే కారణం సంజూ శాంసనే. మిగతా బ్యాటర్లు తడబడగా.. ఓపెనర్‌గా వచ్చిన అతను మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సెంచరీతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి సౌతాఫ్రికా బౌలర్లను పరుగులు పెట్టించాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(7) మరోసారి నిరాశపర్చడంతో 4వ ఓవర్‌లోనే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అయినప్పటికీ శాంసన్ ఏ మాత్రం బెదరలేదు. బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లు దంచాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 సిక్స్‌లు, 7 ఫోర్లు ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే 27 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అతను.. మరో 20 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్(21) విలువైన పరుగులు జోడించగా.. తిలక్ వర్మ(33) సత్తాచాటాడు. వారి సహకారంతో శాంసన్ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టాడు. 15 ఓవర్లలోనే స్కోరు 170 దాటింది. అయితే, సెంచరీ పూర్తి చేసిన కాసేటికే శాంసన్ వెనుదిరగగా.. ఆ తర్వాత భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. పాండ్యా(2), రింకు సింగ్(11) అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యారు. అక్షర్ పటేల్(7), రవి బిష్ణోయ్(1) ఆఖరి ఓవర్‌లో వికెట్లు పారేసుకున్నారు. 27 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు నష్టపోయిన భారత్.. ఆఖరి ఓవర్‌లో 200 పరుగుల మార్క్‌ను దాటేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ 3 వికెట్లతో సత్తాచాటగా.. జాన్సెన్, కేశమ్ మహారాజ్, పీటర్, పాట్రిక్ క్రూగర్ చెరో వికెట్ తీశారు.
సఫారీలను శాసించారు
సొంతగడ్డపై సఫారీలు తేలిపోయారు. భారీ స్కోరు చూసి కంగుతిన్న దక్షిణాఫ్రికా ఛేదనలో కనీసం పోరాటం చేయలేకపోయింది. తొలి ఓవర్‌లో మొదలైన ఆ జట్టు వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ ధాటికి సఫారీలు క్రీజులో నిలువలేకపోయారు. క్లాసెన్ చేసిన 25 పరుగులే టాప్ స్కోర్. సౌతాఫ్రికాను మొదట దెబ్బ కొట్టింది పేసర్లు. తొలి ఓవర్‌లోనే మార్‌క్రమ్(8)ను అర్ష్‌దీప్ అవుట్ చేయగా.. కాసేపటికే స్టబ్స్(11)ను అవేశ్ ఖాన్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి స్పిన్‌తో ప్రత్యర్థిని దెబ్బ మీద దెబ్బకొట్టాడు. దూకుడుగా ఆడుతున్న ర్యాన్ రికెల్టన్(21)కు చెక్ పెట్టడంతో సౌతాఫ్రికా పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయింది. అనంతరం క్లాసెన్(25), డేవిడ్ మిల్లర్(18) ఇన్నింగ్స్ నిర్మించేందుకు ప్రయత్నించారు. అయితే, వారిద్దరిని చక్రవర్తి ఒకే ఓవర్‌లో అవుట్ చేశాడు. కీలక వికెట్లు పడటంతో సౌతాఫ్రికా ఓటమి ఖరారైపోయింది. ఆ తర్వాత రవి బిష్ణోయ్ తన స్పిన్ మంత్రాన్ని ప్రయోగించాడు. 13వ ఓవర్‌లో పాట్రిక్ క్రూగర్(1), సిమెలనె(6) వికెట్లు తీసిన అతను.. వరుస ఓవర్‌లో మార్కో జాన్సెన్(12)ను పెవిలియన్ పంపాడు. గెరాల్డ్ కోయెట్జీ(23) రనౌటవ్వగా.. 10 వికెట్‌గా మహారాజ్(5)ను అవేశ్ ఖాన్ అవుట్ చేసి సౌతాఫ్రికా ఆట ముగించాడు.
తొలి సెంచరీకి 9 ఏళ్లు.. రెండో శతకానికి 27 రోజులే
సంజూ శాంసన్ 2015లో టీ20ల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అరంగేట్రం చేసిన తర్వాత పొట్టి ఫార్మాట్‌లో తొలి సెంచరీ చేయడానికి అతనికి 9ఏళ్లు పట్టింది. గత నెలలో బంగ్లాదేశ్‌తో తొలి టీ20 సెంచరీని నమోదు చేశాడు. అయితే, తన రెండో టీ20 శతకానికి శాంసన్ 27 రోజులే తీసుకున్నాడు. అది కూడా తొలి శతకం బాదిన తర్వాతి మ్యాచ్‌లోనే కావడం విశేషం. సౌతాఫ్రికాపై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అతను 47 బంతుల్లోనే సెంచరీ బాదాడు. స్ట్రైక్‌రేట్ 214 ఉండటం గమనార్హం. బ్యాక్ టూ బ్యాక్ సెంచరీలు బాదిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వరల్డ్ క్రికెట్‌లో 4వ బ్యాటర్. శాంసన్ కంటే ముందు గుస్తావ్ మెకియోన్(ఫ్రాన్స్), రిలే రోసోవ్(సౌతాఫ్రికా), ఫిల్ సాల్ట్(ఇంగ్లాండ్) వరుస టీ20ల్లో సెంచరీలు చేశారు. అలాగే, టీ20ల్లో ఒక్కటి కంటే ఎక్కువ శతకాలు చేసిన భారత క్రికెటర్ల జాబితాలో సూర్యకుమార్, రోహిత్, కేఎల్ రాహుల్ సరసన చేరాడు.