IND VS PAK : ఇంగ్లాండ్‌లో భారత్, పాక్ టెస్టు సిరీస్?.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఏం చెప్పిందంటే?

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత్, పాక్ జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు.

Update: 2024-07-27 12:26 GMT

దిశ, స్పోర్ట్స్ : ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత్, పాక్ జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. కేవలం ఐసీసీ ఈవెంట్లలో, ఆసియా కప్‌లో మాత్రమే ఎదురుపడుతున్నాయి. ఇరు జట్లు ఎప్పుడు తలపడతాయని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తుంటారు. భారత్, పాక్ మ్యాచ్‌కు అంత క్రేజ్ ఉంటుంది. దీనిని దృష్టి పెట్టుకుని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు దాయాదుల పోరుకు ఆతిథ్యమివ్వడానికి సిద్ధమని గతంలోనే ప్రకటించింది. తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా భారత్, పాక్ మధ్య టెస్టు సిరీస్ నిర్వహించడానికి ముందుకొచ్చింది.

ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు సందర్భంగా ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్ మాట్లాడుతూ.. భారత్, పాక్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వాలన్న కోరిక వ్యక్తం చేశారు. ‘భారత్, పాక్ టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వడం అసాధ్యమని చెప్పలేను. బీసీసీఐ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య, ప్రభుత్వాల మధ్య రాజకీయాలు అందరికీ తెలిసిందే. ఐసీసీ మీటింగ్ కోసం శ్రీలంకలో మేము వారంపాటు ఉన్నాం. అక్కడ పాక్ క్రికెట్ మద్దతుదారులు, భారత్ క్రికెట్ మద్దతుదారులు బాగానే ఉన్నారు. కానీ, రాజకీయాలు గురించి వచ్చేసరికే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.’ అని తెలిపారు. కాగా, భారత్, పాక్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరిగి 17 ఏళ్లు అవుతుంది. చివరిసారిగా 2007లో మూడు టెస్టుల సిరీస్‌కు భారత్ ఆతిథ్యమిచ్చింది. ఆ సిరీస్‌ను 1-0తో టీమిండియా సొంతం చేసుకుంది. 

Tags:    

Similar News