భారత ఫుట్‌బాల్‌లో ఓ శకం ముగిసింది.. చివరి మ్యాచ్ ఆడేసిన సునీల్ ఛెత్రి

భారత ఫుట్‌బాల్‌లో ఓ శకం ముగిసింది. దిగ్గజ ఆటగాడు సునీల్ ఛెత్రి భారత్ తరపున ఆఖరి మ్యాచ్ ఆడేశాడు.

Update: 2024-06-06 17:36 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత ఫుట్‌బాల్‌లో ఓ శకం ముగిసింది. దిగ్గజ ఆటగాడు సునీల్ ఛెత్రి భారత్ తరపున ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. 39 ఏళ్ల ఛెత్రి ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా గురువారం కువైట్‌తో జరిగిన మ్యాచ్‌‌తో ఆటకు వీడ్కోలు పలికాడు.

వరల్డ్ కప్‌ క్వాలిఫయర్స్‌లో తర్వాతి రౌండ్‌కు చేరుకోవాలంటే కువైట్‌పై గెలవడం కీలకం. తన ఆఖరి మ్యాచ్‌లో జట్టుకు అపూర్వ విజయం అందించి వీడ్కోలు పలకాలని భావించిన ఛెత్రికి ఆ కల నిజమవ్వలేదు. చివరివరకూ ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. ఏ జట్టు గోల్ చేయలేకపోయింది. ప్రస్తుతం గ్రూపు ఏలో రెండో స్థానంలో ఉన్న భారత్‌.. తర్వాతి మ్యాచ్‌లో ఖతార్‌పై గెలిస్తే మూడో రౌండ్‌కు చేరుకోవచ్చు.

మ్యాచ్ అనంతరం సునీల్ ఛెత్రి భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్లతో మైదానాన్ని వీడాడు. సహచర ఆటగాళ్లు అతనికి ‘గార్డ్ ఆఫ్ హానర్’ ఇచ్చారు. ఆ సమయంలో ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో స్టేడియాన్ని హోరెత్తించారు. సునీల్ ఛెత్రి ప్రేక్షకులకు థాంక్యూ చెబుతూ డ్రెస్సింగ్‌ రూంకు వెళ్లాడు. కాగా, సునీల్ ఛెత్రి 151 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 94 గోల్స్ చేసి అతను.. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్లలో జాబితాలో నాలుగో స్థానంతో వీడ్కోలు పలికాడు.  


Similar News