రాజ్‌కోట్‌లో రోహిత్ సేన సత్తాచాటేనా?.. రేపటి నుంచి మూడో టెస్టు షురూ
ఐదు టెస్టుల సిరీస్‌లో రాజ్‌కోట్ వేదికగా గురువారం నుంచి మూడో టెస్టు ప్రారంభంకానుంది.
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు కోల్పోయి సిరీస్‌లో వెనుకబడిన టీమ్ ఇండియా వైజాగ్ టెస్టులో పుంజుకుని సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 10 రోజుల విరామం తర్వాత భారత జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఐదు టెస్టుల సిరీస్‌లో రాజ్‌కోట్ వేదికగా గురువారం నుంచి మూడో టెస్టు ప్రారంభంకానుంది. రాజ్‌కోట్‌లో సత్తాచాటి 2-1తో ఆధిక్యం సాధించాలనే లక్ష్యంతో టీమ్ ఇండియా బరిలోకి దిగుతున్నది. మరోవైపు, రెండో టెస్టులో ఓడిన ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో పుంజుకోవడంతోపాటు ఆధిక్యంపై ఫోకస్ పెట్టింది. మరి, ఇంగ్లాండ్‌ను దాటి రోహిత్ సేన ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. మూడో టెస్టులో టీమ్ ఇండియా ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్ కారణంగా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉంటున్నాడు. ఇప్పటికే కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ దూరమవ్వగా.. రాహుల్ కూడా అందుబాటులో ఉండకపోవడంతో బ్యాటింగ్ దళం పేపర్‌పై కాస్త బలహీనంగానే కనిపిస్తుంది. సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, దేవదత్ పడిక్కల్‌పై మిడిలార్డర్ ఆధారపడింది. ఈ కుర్రాళ్లు దేశవాళీలో సత్తాచాటిన వాళ్లే. అయితే, ఇంగ్లాండ్‌పై ఏ మేరకు రాణిస్తారో చెప్పలేం. దీంతో ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, రోహిత్ శర్మతోపాటు శుభ్‌మన్ గిల్‌పైనే జట్టు ఎక్కువగా ఆధారపడి ఉంది. జైశ్వాల్, గిల్ ఫామ్‌లో ఉండటం, జడేజా భారత్‌కు బలంగా కనిపిస్తున్నాయి. గత రెండు మ్యాచ్‌ల్లో తన స్థాయి ప్రదర్శన చేయలేకపోయిన కెప్టెన్ రోహిత్ ఈ మ్యాచ్‌లో పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు, బౌలింగ్ పరంగా టీమ్ ఇండియా బలంగానే కనిపిస్తున్నది. స్పిన్ పిచ్‌లపై బుమ్రా సత్తాచాటుతుండటం జట్టుకు ప్రధాన బలం. సిరాజ్ మెరుగవ్వాల్సి ఉంది. అశ్విన్, జడేజా, కుల్దీప్‌లతో కూడిన స్పిన్ దళంపై జట్టు నమ్మకంగా ఉంది.
సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్ అరంగేట్రం?
రెండో టెస్టులో రజత్ పాటిదార్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. మూడో టెస్టులో మరో ఇద్దరు కుర్రాళ్లు అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టేందుకు ఎదురుచూస్తున్నారు. కేఎల్ రాహుల్ దూరమవడంతో ఆ స్థానం కోసం సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్ పోటీపడుతున్నారు. అయితే, టీమ్ మేనేజ్‌మెంట్ సర్ఫరాజ్ ఖాన్ వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, తెలుగు కుర్రాడు, వికెట్ కీపర్ కేఎస్ భరత్ వరుసగా నిరాశపరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు అతన్ని పక్కనపెట్టి మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌ను తీసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్టు తెలిసింది. అదే జరిగితే సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేయనున్నారు.
అప్పుడు డ్రా
రాజ్‌కోట్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు టెస్టు మ్యాచ్‌లో తలపడటం ఇది రెండోసారి. 2016లో మొదటిసారి ఎదురుపడగా.. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగులు చేయగా.. భారత్ 488 స్కోరు చేసింది. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో 260/3 స్కోరు వద్ద ఇంగ్లాండ్ జట్టు డిక్లేర్డ్ ఇచ్చి భారత్ 310 పరుగుల లక్ష్యం పెట్టింది. ఛేదనకు దిగిన భారత్ చివరి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 172/6 స్కోరుతో నిలిచి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. విరాట్ కోహ్లీ(48), జడేజా(32) అజేయంగా నిలిచి భారత్‌ను ఓటమి నుంచి బయటపడేశారు.
పిచ్ రిపోర్ట్
రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇంతకుముందు ఇక్కడ రెండు టెస్టులు జరిగాయి. పిచ్ బ్యాటర్లకు అనుకూలించనుంది. అయితే, స్పిన్నర్ల నుంచి సవాల్ ఎదుర్కోకతప్పదు. ఇక్కడ జరిగిన గత మ్యాచ్‌లను పరిశీలిస్తే లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తే పేసర్లు కూడా ప్రభావం చూపొచ్చు. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవచ్చు.
తుది జట్లు
భారత్(అంచనా) : యశస్వి జైశ్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్, కేఎస్ భరత్/ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్.
ఇంగ్లాండ్ : జాక్ క్రాలీ, బెన్ డక్కెట్, ఓలీ పోప్, జోరూట్, బెయిర్‌స్టో, బెన్‌స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్‌వుడ్, జేమ్స్ అండర్సన్.