సత్తాచాటిన స్పిన్ త్రయం.. దంచికొట్టిన జైశ్వాల్.. తొలి రోజు మనోళ్లదే..

155/7 స్కోరు నుంచి ఇంగ్లాండ్ 246 పరుగులు చేసిందంటే కారణం కెప్టెన్ బెన్‌స్టోక్స్.

Update: 2024-01-25 19:55 GMT

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టును టీమ్ ఇండియా మెరుగ్గా ఆరంభించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో తొలి రోజు ఆధిపత్యం చాటింది. మొదట జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్ స్పిన్ త్రయం చెలరేగడం.. చివరి ఇన్నింగ్స్‌లో యశస్వి జైశ్వాల్ బ్యాటు ఝుళిపించడం.. ఇలా మొదటి రోజు టీమ్ ఇండియా సత్తాచాటింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేసి ఆలౌటైంది. కెప్టెన్ బెన్‌స్టోక్స్(70) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేయడం గమనార్హం. అశ్విన్(3/68), జడేజా(3/88) స్పిన్ ఉచ్చులో చిక్కుకుని ప్రత్యర్థి బ్యాటర్లు విలవిలలాడారు. అక్షర్ పటేల్, పేసర్ బుమ్రా సైతం ఇంగ్లాండ్ పతనంలో తమ పాత్ర పోషించారు. చివరి ఇన్నింగ్స్‌లో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్(76 బ్యాటింగ్) హాఫ్ సెంచరీతో రాణించాడు. జైశ్వాల్‌తోపాటు శుభ్‌మన్ గిల్(14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. టీమ్ ఇండియా ఇంకా 127 పరుగులు వెనుకబడి ఉన్నది.

భారత్ స్పిన్నర్ల ధాటికి ఇంగ్లాండ్ విలవిల

ఉప్పల్ స్టేడియంలో భారత స్పిన్నర్లు సత్తాచాటారు. 10 వికెట్లలో 8 వికెట్లు వారివే. జడేజా, అశ్విన్ ద్వయం ఇంగ్లాండ్ పతనాన్ని శాసించగా.. అక్షర్ సైతం మెరిశాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు జాక్ క్రాలీ(20), డక్కెట్(35) బాగానే ఆరంభించారు. జాక్ క్రాలీ డిఫెన్స్‌కే పరిమితమవ్వగా.. డక్కెట్ మాత్రం ధాటిగానే ఆడాడు. ఈ సమయంలో 8 ఓవర్ల తర్వాత కెప్టెన్ రోహిత్.. స్పిన్నర్లు అశ్విన్, జడేజాలను బరిలోకి దించాడు. పిచ్ అనుకూలతతో రెచ్చిపోయిన ఈ ద్వయం ఇంగ్లాండ్‌ను దెబ్బ మీద దెబ్బకొట్టింది. మొదట అశ్విన్ 12వ ఓవర్‌లో డక్కెట్(35)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఓపెనింగ్ జోడీని విడదీశాడు. ఆ తర్వాత కాసేపటికే ఓలీ పోప్(1)ను జడేజా పెవిలియన్ పంపాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే జాక్ క్రాలీ(20)ని అశ్విన్ అవుట్ చేయడంతో 5 పరుగుల వ్యవధిలోనే ఇంగ్లాండ్ మూడు వికెట్లు కోల్పోయి 60/3 స్కోరుతో నిలిచింది. అనంతరం జోరూట్(29), బెయిర్‌స్టో(37) ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు చూశారు. నాలుగో వికెట్‌కు ఈ జోడీ 61 పరుగులు జోడించింది. మరోసారి భారత బౌలర్లు పుంజుకోవడంతో ఇంగ్లాండ్ కష్టాల్లో కూరుకుపోయింది. అక్షర్ పటేల్‌ బౌలింగ్‌లో బెయిర్ స్టో పెవిలియన్ బాట పట్టగా.. రూట్‌తోపాటు ఫోక్స్(4), రెహాన్ అహ్మద్(13) వెనువెంటే వికెట్లు పారేసుకున్నారు. దీంతో ఇంగ్లాండ్ 155/7 స్కోరుతో నిలిచి 200ల్లోపే అలౌటయ్యేలా కనిపించింది.

ఆదుకున్న స్టోక్స్

155/7 స్కోరు నుంచి ఇంగ్లాండ్ 246 పరుగులు చేసిందంటే కారణం కెప్టెన్ బెన్‌స్టోక్స్. కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. టామ్ హార్ట్లీ(23), మార్క్‌వుడ్(11) సహకారంతో జట్టును నడిపించాడు. మొదట్లో నెమ్మదిగా ఆడిన అతను.. ఆ తర్వాత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. జడేజా వేసిన 57వ ఓవర్‌లో మూడు ఫోర్లు కొట్టి గేర్ మార్చాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌ ముగింపులో ఇంగ్లాండ్ 200 స్కోరు దాటింది. ఈ క్రమంలోనే జడేజా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం కూడా ధాటిగా ఆడుతున్న స్టోక్స్(70)ని బుమ్రా అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో జడేజా, అశ్విన్ మూడేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, బుమ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

బ్యాటు ఝుళిపించిన జైశ్వాల్

తొలి రోజే ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన భారత్ చివరి సెషన్‌లో తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, కెప్టెన్ రోహిత్ తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందించారు. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ మరోసారి దూకుడు ఆటతీరుతో అలరించాడు. రోహిత్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ సహకరించగా జైశ్వాల్ బౌండరీలతో ధాటిగా ఆడాడు. ఇన్నింగ్స్‌ తొలి బంతినే ఫోర్ కొట్టి అతను తొలి రోజు ఆట ముగిసే వరకూ అదే జోరు ప్రదర్శించాడు. ముఖ్యంగా టామ్ హార్ట్లీని లక్ష్యంగా చేసుకుని పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో 47 బంతుల్లో అతను హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు, రోహిత్(24) నుంచి ఇలాంటి ఇన్నింగ్సే ఆశించినప్పటికీ.. అతను స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. జాక్ లీచ్ బౌలింగ్‌లో రోహిత్ స్టోక్స్‌కు చిక్కి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన గిల్(14 బ్యాటింగ్)తో కలిసి జైశ్వాల్ తొలి రోజు ఆట ముగించాడు. 70 జైశ్వాల్ 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 76 పరుగులతో అజేయంగా నిలిచాడు.

స్కోరుబోర్డు

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 246 ఆలౌట్(64.3 ఓవర్లు)

జాక్ క్రాలీ(సి)సిరాజ్(బి)అశ్విన్ 20, డక్కెట్ ఎల్బీడబ్ల్యూ(బి)అశ్విన్ 35, ఓలీ పోప్(సి)రోహిత్(బి)జడేజా 1, రూట్(సి)బుమ్రా(బి)జడేజా 29, బెయిర్‌స్టో(బి)అక్షర్ 37, స్టోక్స్(బి)బుమ్రా 70, ఫోక్స్(సి)శ్రీకర్ భరత్(బి)అక్షర్ 4, రెహాన్ అహ్మద్(సి)శ్రీకర్ భరత్(బి)బుమ్రా 13, టామ్ హార్ట్లీ(బి)జడేజా 23, మార్క్‌వుడ్(బి)అశ్విన్ 11, జాక్ లీచ్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 3

వికెట్ల పతనం : 55-1, 58-2, 60-3, 121-4, 125-5, 137-6, 155-7, 193-8, 234-9, 246-10

బౌలింగ్ : బుమ్రా(8.3-1-28-2), సిరాజ్(4-0-28-0), జడేజా(18-4-88-3), అశ్విన్(21-1-68-3), అక్షర్(13-1-33-2)

భారత్ తొలి ఇన్నింగ్స్ : 119/1 ఆలౌట్(23 ఓవర్లు)

యశస్వి జైశ్వాల్ 76 బ్యాటింగ్, రోహిత్(సి)స్టోక్స్(బి)జాక్ లీచ్ 24, శుభ్‌మన్ గిల్ 14 బ్యాటింగ్; ఎక్స్‌ట్రాలు 5

వికెట్ల పతనం : 80-1

బౌలింగ్ : మార్క్‌వుడ్(2-0-9-0), టామ్ హార్ట్లీ (9-0-63-0), జాక్ లీచ్ (9-2-24-1), రెహాన్ అహ్మద్ (3-0-22-0)

Tags:    

Similar News