Asia Cup : వచ్చే ఏడాది భారత్‌లో ఆసియా కప్.. గతంలో ఎప్పుడు ఆతిథ్యమిచ్చిందో తెలుసా?

వచ్చే ఏడాది జరగబోమే పురుషుల ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది.

Update: 2024-07-29 15:53 GMT

దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఏడాది జరగబోమే పురుషుల ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. తాజాగా ఈ విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధికారికంగా వెల్లడించింది. ఈ టోర్నీని టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఆసియా కప్‌కు ఇండియా ఆతిథ్యమివ్వడం ఇది రెండోసారి. 1990-91లో తొలిసారిగా వేదికైంది. దాదాపు 34 ఏళ్ల తర్వాత భారత్‌లో ఆసియా కప్ జరగబోతున్నది. ఈ టోర్నీలో 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ జట్లు నేరుగా అర్హత సాధించగా.. ప్రీమియర్ కప్ నుంచి యూఏఈ ఈ క్వాలిఫై అయ్యింది. ఈ టోర్నీని వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది.

మరోవైపు, ఆసియా కప్‌-2027 బంగ్లాదేశ్‌లో జరగనుంది. ఆ టోర్నీని వన్డే ఫార్మాట్‌లో నిర్వహించబోతున్నారు. గతేడాది ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్‌లో నిర్వహించగా భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఆ టోర్నీ పాక్‌లో జరగాల్సి ఉండగా.. పాక్‌కు వెళ్లేందుకు టీమిండియా నిరాకరించడంతో టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించారు. భారత్ తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది పాక్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీని కూడా హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని బీసీసీఐ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది పాక్ జట్టు భారత్‌లో అడుగుపెడుతుందో లేదో వేచి చూడాల్సిందే. 

Tags:    

Similar News