ఖతార్ చేతిలో భారత్ ఓటమి.. ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ నుంచి ఔట్

ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో భారత్ పోరాటం ముగిసింది.

Update: 2024-06-11 19:20 GMT

దిశ, స్పోర్ట్స్ : ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో భారత్ పోరాటం ముగిసింది. మంగళవారం కీలక పోరులో ఖతారు చేతిలో ఓటమితో 3వ రౌండ్ ఆశలు గల్లంతయ్యాయి. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఖతార్ 2-1 తేడాతో విజయం సాధించింది. అయితే, మ్యాచ్‌లో మొదట ఆధిపత్యం భారత్‌దే. 37వ నిమిషంలో లాలియన్‌జువాలా చాంగ్టే భారత్‌కు తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత భారత్ డిఫెన్స్ టీమ్ ఖతారును నిలువరించడంతో ప్రత్యర్థి ఫస్టాఫ్‌లో గోల్ చేయలేదు. అయితే, సెకండాఫ్‌లో ఖతార్ పుంజుకుంది. స్వల్ప వ్యవధిలో యూసఫ్ ఐమెన్(73వ నిమిషం), అహ్మద్ అలీ రవి(85వ నిమిషం) గోల్స్ చేసి జట్టును గెలిపించారు. అయితే, సెకండాఫ్‌లో రిఫరీ తప్పిదాలు భారత్ విజయవకాశాలను దెబ్బతీశాయి. యూసఫ్ ఐమెన్ చేసిన గోల్ వివాదస్పదమైంది. బంతి నెట్‌లోకి వెళ్లకముందు లైన్ దాటినట్టు కనిపించింది. అలాగే, పలు రిఫరీ నిర్ణయాలు భారత్‌కు వ్యతిరేకంగా వచ్చాయి. గ్రూపు ఏ నుంచి ఖతరా్, కువైట్ తర్వాతి రౌండ్‌కు చేరుకున్నాయి. భారత్ మూడో స్థానంతో సరిపెట్టింది.


Similar News