డబ్ల్యూటీసీలో అగ్రస్థానాన్ని కోల్పోయిన భారత్.. ఆ జట్టుకు టాప్ ర్యాంక్
డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో టీమిండియా అగ్రస్థానాన్ని కోల్పోయింది.
దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టులోనూ టీమిండియా పరాజయం పాలైంది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను కివీస్ క్లీన్‌స్వీప్ చేసింది. సొంతగడ్డపై మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్ కావడం భారత్‌కు ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతేకాకుండా, మూడో టెస్టులోనూ ఓటమితో టీమిండియా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.
ఈ సిరీస్‌కు ముందు భారత్ డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో 75.75 శాతంతో అగ్రస్థానంలో ఉండేది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ అగ్రస్థానాన్ని కాపాడుకుంది. కానీ, మూడో టెస్టులో పరాజయంతో భారత్ టాప్ ర్యాంక్‌ను కోల్పోయింది. 58.33 పర్సంటేజ్‌తో రెండో స్థానానికి పడిపోయింది. 14 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ సేన 8 వియాలు, 5 ఓటములు, ఒక్క డ్రాను పొందింది. భారత్ ఓటమితో ఆస్ట్రేలియా(62.50 శాతం) అగ్రస్థానానికి చేరుకుంది. శ్రీలంక(55.56), న్యూజిలాండ్(54.55), సౌతాఫ్రికా(54.17) జట్లు వరుసగా 3వ, 4వ, 5వ స్థానాల్లో ఉన్నాయి.
న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ కోసం ఇతర జట్ల నుంచి భారత్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కనీసం నాలుగు టెస్టుల్లో గెలిచి, మరొక మ్యాచ్‌ను డ్రా చేసుకుంటేనే ఫైనల్ చాన్స్‌లు ఉంటాయి. ఒక్కటి ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.