ఆరో టైటిల్‌పై యువ భారత్ కన్ను..రేపు అండర్-19 వరల్డ్ కప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో ఢీ

ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌ ఫైనల్‌లో ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.

Update: 2024-02-10 15:58 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో తిరుగులేని రికార్డు భారత్ సొంతం. గతంలో 8 సార్లు ఫైనల్‌కు చేరితే.. అందులో ఐదుసార్లు టైటిల్ తెచ్చింది. టోర్నీ చరిత్రలో అత్యధిక సార్లు చాంపియన్‌గా నిలిచిన ఘనత కూడా టీమ్ ఇండియాదే. ఇప్పుడు యువ భారత్ 6వ టైటిల్‌పై కన్నేసింది. డిఫెండింగ్ చాంపియన్‌గా అడుగుపెట్టిన భారత్ టోర్నీ చరిత్రలో 9వసారి ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. టైటిల్ పోరులో ఆస్ట్రేలియాతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైంది. ఆదివారం సౌతాఫ్రికాలోని బెనోని వేదికగా ఫైనల్ జరగనుంది.

టోర్నీలోనే కాదు ఆస్ట్రేలియాపై కూడా భారత్‌కు మంచి రికార్డే ఉంది. గతంలో ఇరు జట్లు(2012, 2018) రెండుసార్లు ఫైనల్‌లో తలపడగా.. రెండుసార్లు టీమ్ ఇండియానే చాంపియన్‌గా నిలిచింది. ఈ సారి కూడా అదే రిపీట్ చేయాలని యువ భారత్ భావిస్తున్నది. టోర్నీలో భారత జట్టు ఒక్క ఓటమి కూడా ఎదుర్కోలేదు. గ్రూపు దశ, సూపర్-6 రౌండ్లలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో వరుస విజయాలు సాధించింది. కెప్టెన్ ఉదయ్ సహారన్, ముషీర్ ఖాన్, సచిన్ దాస్ భీకర ఫామ్‌లో ఉన్నారు. వారితోపాటు ఓపెనర్లు ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి కూడా రాణిస్తే భారత్‌కు బ్యాటింగ్‌లో తిరుగుండదు. మరోవైపు, సౌమీ పాండే, రాజ్ లింబాని, నమన్ తివారీలతో బౌలింగ్ దళం కూడా పట్టిష్టంగా ఉంది. మరోవైపు, ఆసిస్ జట్టును నిలకడలేమి సమస్య వెంటాడుతున్నది. అయితే, ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు. బ్యాటర్లలో కెప్టెన్ వ్యూ వీబ్జెన్, హ్యారీ డిక్సన్, ర్యాన్ హిక్స్, సామ్ కాన్స్టాస్ వంటి వారు తమదైన రోజున చెలరేగేవారే. బౌలింగ్ దళంలో మహ్లీ బార్డ్‌మెన్, కల్లమ్ విడ్లర్ నిలకడగా రాణిస్తుండగా.. టామ్ స్ట్రాకర్, చార్లీ అండర్సన్ హర్కీరత్ బజ్వా‌ సవాల్ విసరనున్నారు. 

Tags:    

Similar News